IND vs WI 1st T20: అరంగేట్రంలోనే తిలక్ వర్మ అద్భుత రన్నింగ్ క్యాచ్.. వెస్టిండీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్!
ABN, First Publish Date - 2023-08-03T21:22:09+05:30
తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కెరీర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ ఫీల్డింగ్ విన్యాసాలు అదిరిపోయాయి.
ట్రినిడాడ్: తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కెరీర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ ఫీల్డింగ్ విన్యాసాలు అదిరిపోయాయి. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన 8వ ఓవర్ మూడో బంతిని వెస్టిండీస్ వన్‌డౌన్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ భారీ షాట్ ఆడాడు. దీంతో ఆ బంతి చాలా సేపు గాలిలో ఉంది. ఒకనొక దశలో అది సిక్సు అనుకున్నారంతా.. కానీ ఆ బంతి మైదానంలోనే ల్యాండ్ అవుతుండడాన్ని గమనించిన తిలక్ వర్మ తన ఎడమవైపునకు వేగంగా 10 నుంచి 15 మీటర్లు పరిగెత్తాడు. అంతటితో ఆగకుండా డైవ్ చేసి మరి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో చార్లెస్ 3 పరుగులకే ఔట్ అయ్యాడు. నిరాశతో మైదానం వీడక తప్పలేదు. దెబ్బకు చార్లెస్ మైండ్ బ్లాంక్ అయిపోయిందనే చెప్పుకోవాలి. తిలక్ వర్మ అద్భుత ఫీల్డింగ్‌కు ఫిదా అయిపోయిన తోటి ఆటగాళ్లు అతన్ని అభినందించారు. కెరీర్ తొలి మ్యాచ్‌లోనే తిలక్ వర్మ అద్భుత ఫీల్డింగ్‌కు తోటి ఆటగాళ్లే కాకుండా మ్యాచ్ చూస్తున్న వారంతా కూడా ఫిదా అయిపోయారు. నిజానికి ఇదివరకే ఫీల్డింగ్‌లో తిలక్‌కు మంచి పేరుంది. ఇక తిలక్ అద్భుత ఫీల్డింగ్‌తో విండీస్ 58 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ నికోలస్ పూరన్ క్యాచ్‌ను కూడా అందుకున్నాడు. కాగా తిలక్ వర్మ అద్భుత ఫీల్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తిలక్‌తోపాటు ముఖేష్ కుమార్ కూడా టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. కాగా ఈ విండీస్ పర్యటనలో 29 ఏళ్ల ముఖేష్ కుమార్ టెస్టులు, వన్డేల్లోకి కూడా అరంగేట్రం చేశాడు. దీంతో ఇలా ఒకే పర్యటనలో టెస్టులు, వన్డేలు, టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా ముఖేష్ కుమార్ నిలిచాడు. ఇంతకుముందు 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనలో టి. నటరాజన్ కూడా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌తో టీమిండియా తమ అంతర్జాతీయ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. దీంతో పాక్ తర్వాత 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది.
Updated Date - 2023-08-03T21:27:24+05:30 IST