Ind vs NZ: సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక్క షాట్ ఆడలేకపోయిన పిచ్‌పై కీలక నిర్ణయం
ABN, First Publish Date - 2023-01-31T18:09:28+05:30
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (India Vs NewZealand) మధ్య లక్నో వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 (T20) మ్యాచ్ గుర్తుందా?.. కివీస్ నిర్దేశించిన కేవలం 99 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడ్డారు.
లక్నో: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (India Vs NewZealand) మధ్య లక్నో వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 (T20) మ్యాచ్ గుర్తుందా?.. కివీస్ నిర్దేశించిన కేవలం 99 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడ్డారు. లక్ష్యం స్వల్పమే అయినా ఏకంగా 4 వికెట్లు చేజార్చుకోవడమే కాకుండా ఒకే ఒక్క బంతి మిగిలుండగా అతికష్టం మీద విజయం దక్కింది. ఓవరాల్‌గా చూస్తే ఇదొక టీ20 మ్యాచ్ అనే ఫీలింగే కలగలేదు. బ్యాట్స్‌మెన్లను షాక్‌కు గురిచేస్తూ రూపొందించిన గింగిరాలు తిప్పేసిన పిచ్ (Pitch) దీనంతటికి కారణమైంది. క్రికెట్ నిపుణుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఈ పుణె వికెట్‌ను సిద్ధం చేసిన పిచ్ క్యూరేటర్‌పై (Pitch curator) తొలగింపు వేటుపడింది.
షాకింగ్ పిచ్‌ను రూపొందించిన క్యూటర్‌ను తొలగించినట్టు యూపీసీఏ (Uttar pradesh Cricket Association) మీడియాకు తెలిపింది. వేటుపడిన వ్యక్తి స్థానంలో అత్యంత అనుభవమున్న సంజీవ్ కుమార్ అగర్వాల్ అనే క్యూరేటర్‌ను భర్తీ చేసినట్టు వెల్లడించింది. ఒక నెల వ్యవధిలోనే పిచ్ అంతా మారిపోనుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘ టీ20 మ్యాచ్‌కు ముందు అన్ని సెంటర్ వికెట్లపై దేశీయ క్రికెట్ మ్యాచ్‌లు చాలా జరిగాయి. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం 1 లేదా 2 స్ట్రిప్‌లను క్యూరేటర్ సిద్ధంగా ఉంచాలి. పిచ్‌ను అతిగా ఉపయోగించడం, ప్రతికూల వాతావరణం కారణంగా ఫ్రెష్ వికెట్‌ను సిద్ధం చేయడం సాధ్యపడలేదు’’ అని యూపీసీఏ (UPCA) వెల్లడించింది. కాగా కొత్తగా తీసుకున్న సంజీవ్ కుమార్ అగర్వాల్‌కు గతంలో బంగ్లాదేశ్‌లో పిచ్‌లు రూపొందించిన అనుభవం ఉంది. బీసీసీఐ దిగ్గజ క్యూరేటర్ తపోష్ ఛటర్జీకి అత్యంత సన్నిహితంగా పనిచేస్తారని యూపీసీఏ వర్గాలు వెల్లడించాయి.
కాగా పుణె వేదికగా జరిగిన రెండో టీ20 అనంతరం టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ.. పిచ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ నిజంగా చెబుతున్నా ఇదొక షాకింగ్ వికెట్. టీ20 కోసం రూపొందించినట్టు లేదు. క్యూరేటర్లు లేదా గ్రౌండ్స్ ముందుగానే ఫిచ్ సిద్ధంగా చేసి ఉండాల్సింది’’ అని హార్ధిక్ పాండ్యా చెప్పారు. మరోవైపు విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ పిచ్‌పై షాట్లు ఆడలేకపోయాడు. కాగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (India Vs NewZealand) మధ్య మూడో టీ20 అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనుంది.
Updated Date - 2023-01-31T18:17:23+05:30 IST