పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
ABN, First Publish Date - 2023-07-30T20:16:46+05:30
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలుకొట్టాడు. వన్డే కెరీర్‌లో మొదటి 26 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 1322 పరుగులు చేసిన బాబర్ అజామ్‌ను గిల్ అధిగమించాడు.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలుకొట్టాడు. వన్డే కెరీర్‌లో మొదటి 26 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 1322 పరుగులు చేసిన బాబర్ అజామ్‌ను గిల్ అధిగమించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 34 పరుగులు చేయడం ద్వారా గిల్ ఈ రికార్డును అందుకున్నాడు. కాగా తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడిన గిల్ 61 సగటుతో 1352 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలున్నాయి. ఓ డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. అత్యధిక స్కోర్ 208గా ఉంది. గిల్, బాబర్ తర్వాత 1303 పరుగులు చేసిన జోనాథన్ ట్రాట్(ఇంగ్లండ్) మూడో స్థానంలో, 1275 పరుగులు చేసిన ఫఖర్ జమాన్(పాకిస్థాన్) నాలుగో స్థానంలో ఉన్నారు.
ఇక వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగిన భారత్ చిత్తుగా ఓడింది. హార్దిక్ పాండ్యా నేతృత్వం వహించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 181 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(55) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. గిల్ 34, సూర్యకుమార్ యాదవ్ 24, శార్దూల్ ఠాకూర్ 16, జడేజా 10 పరుగులు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఒకానొక దశలో 91 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ కెప్టెన్ షాయ్ హోప్(63), కీసీ కార్తీ(48) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 92 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 3 వన్డేల సిరీస్‌ను కరేబియన్లు 1-1తో సమం చేశారు. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే మంగళవారం జరగనుంది.
Updated Date - 2023-07-30T20:16:46+05:30 IST