Kohli- Ganguly: కోహ్లీని నేను కెప్టెన్సీ నుంచి తొలగించలేదు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన గంగూలీ
ABN, First Publish Date - 2023-12-05T12:46:17+05:30
రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో జరిగిన డ్రామా గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో కోహ్లీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో జరిగిన డ్రామా గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో కోహ్లీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని సెలెక్టర్లు తప్పించారు. ఇక 2022 ప్రారంభంలో సౌతాఫ్రికాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఓడిపోయిన తర్వాత కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. 2014 నుంచి ఏడేళ్లపాటు టీమిండియా టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన కోహ్లీ అత్యంత విజయంతమైన భారత కెప్టెన్‌గా పేరుగాంచాడు. కానీ ఆకస్మాత్తుగా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో టీమిండియాలో కోహ్లీ కెప్టెన్సీ శకం ముగిసిపోయింది. అయితే వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించడంపై పెద్ద దుమారమే రేగింది. ఈ క్రమంలో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్దం కూడా నెలకొంది. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది.
అయితే రెండేళ్ల క్రిందట జరిగిన ఈ ఘటనపై తాజాగా సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఓ రియాల్టీ షోలో నాటి ఘటన గురించి దాదా మాట్లాడాడు. విరాట్ కోహ్లీని టెస్టు కెప్టెన్సీ నుంచి తాను తొలగించలేదని స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా టీ20ల నుంచి తప్పుకున్నాక వన్డేల నుంచి కూడా కోహ్లీ తప్పుకోవాలని తాను కోరుకున్నట్టు చెప్పాడు. ‘‘విరాట్‌ను నేను కెప్టెన్సీ నుంచి తొలగించలేదు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. టీ20లకు నాయకత్వం వహించేందుకు కోహ్లీ ఆసక్తి చూపలేదు. కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక నేను అతనితో మాట్లాడాను. నీకు టీ20లలో నాయకత్వం వహించడానికి ఆసక్తి లేకపోతే, మొత్తం వైట్ బాల్ క్రికెట్ నుంచి వైదొలగడం మంచిది అని చెప్పాను.’’ అని గంగూలీ చెప్పాడు. అలాగే మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించేకు అతనిని తాను ఎలా ఒప్పించానో గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ‘‘రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడానికి నేను కొంచెం ముందుకు వచ్చాను. ఎందుకంటే మూడు ఫార్మాట్లలో నాయకత్వం వహించడానికి అతను ఆసక్తి చూపలేదు. కాబట్టి బహుషా అందులో నాకు కొంత సహకారం ఉండవచ్చు. కానీ ఎవరు పరిపాలన చేసినా మైదానంలో బాగా రాణించేవారు ఆటగాళ్లే. భారత క్రికెట్ అభివృద్ధికి కృషి చేసేందుకు నేను బీసీసీఐ అధ్యక్షుడిగా నియమించబడ్డాను. ఇది ఒక చిన్న భాగం’’ అని గంగూలీ అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-05T14:15:33+05:30 IST