Suryakumar yadav: పేరుకేమో మిస్టర్ 360.. కానీ 0, 0, 0.. సంజూకి తీవ్ర అన్యాయం.. ఫ్యాన్స్ ఫైర్..
ABN, First Publish Date - 2023-03-23T14:42:22+05:30
దక్షిణాఫ్రికా దిగ్గజం ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్‌తో పోల్చుతూ సూర్యకి ప్రశంసలు కూడా వచ్చాయి. నమ్మకమైన ఆటగాడిగా మారడంతో వన్డేల్లో కూడా ఎంట్రీ దక్కింది. కానీ ....
సూర్యకుమార్ యాదవ్ (surya kumar yadav) టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ 1 బ్యాట్స్‌మెన్. ఐపీఎల్‌లో (IPL) ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో మలుపుతిప్పిన ట్రాక్ రికార్డ్ ఉన్న ఆటగాడు. బౌలర్ ఎవరైనా.. వేదిక ఏదైనా.. బంతిని మైదానం అన్ని దిశలా తరలించగల సత్తా ఉన్న హిట్టర్. అందుకే దక్షిణాఫ్రికా దిగ్గజం ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్‌తో పోల్చుతూ సూర్యకి ప్రశంసలు కూడా వచ్చాయి. నమ్మకమైన ఆటగాడిగా మారడంతో వన్డేల్లో కూడా ఎంట్రీ దక్కింది. కానీ స్వదేశంలో ఆస్ట్రేలియాపై 3 వన్డేల సిరీస్‌లో (IndiaVsAustralia ODI series) సూర్య ఆటతీరు చూశాక భారతీయ క్రికెట్ అభిమానులందరికీ చిర్రెత్తుకొస్తోంది. ఆసీస్‌పై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్డెన్ డకౌట్‌గా సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) వెనుదిరిగాడు. క్రీజుల్లోకి రావడం తొలి బంతికే ఔటవ్వడం.. హెల్మెంట్ కాస్త పైకిలేపి.. నోట్లో బబుల్‌గమ్ నములుకుంటా పెవీలియన్‌కు నడుకుంటూ వెళ్లిపోవడం ఇదీ మూడు మ్యాచ్‌ల్లో సూర్య ప్రదర్శన. దీంతో అతడి సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.
చెత్త రికార్డ్..
తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్న సూర్య.. చివరి వన్డేలో ఆగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఏ ఆటగాడూ కోరుకోని చెత్త రికార్డును సాధించాడు. ఒక వన్డే సిరీస్‌లో ఆడిన మ్యాచ్‌లు అన్నింటిలోనూ డకౌట్ అయిన ఆరవ భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్య నిలిచాడు. సూర్యకంటే ముందు సచిన్, అనిల్ కుంబ్లే, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, జస్ర్పీత్ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. అయితే సచిన్ తెందుల్కర్ తప్ప మిగతావారందరూ బౌలర్లే కావడం గమనార్హం.
మిస్టర్ 360తో పోలికా..
వరుసగా మూడు డకౌట్ల నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శల జడివాన కురుస్తోంది. టీ20, వన్డేలు, టెస్టుల్లో అద్భుతమైన రికార్డులున్న దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివీలియర్స్‌తో సూర్యకుమార్ యాదవ్‌తో పోల్చడంపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఐపీఎల్, టీ20 ఫార్మాట్ తప్ప మిగతా ఫార్మాట్లకు అనవసరమంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఫేక్ 360’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే బ్యాడ్ లక్ సమయంలో ఏ ఆటగాడికైనా ఇలాగే జరుగుతుందని, వన్డేల్లో సూర్యకి అసలు అనుభవంలేదని, అందుకే కుదురుకునేందుకు అవకాశాలు ఇవ్వాలని చాలా తక్కువమంది సమర్థిస్తున్నారు.
సంజూకు అన్యాయం!
సూర్యకుమార్ యాదవ్ కోసం సంజూ శాంసన్‌ను పక్కనపెట్టారనే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదే సంజూ ఈ విధంగా వరుసగా మూడు డకౌట్లు అయితే ఎంతగా విమర్శించేవాళ్లో అంటూ మండిపడుతున్నారు. సంజూకు ఇంకెంత కాలం అన్యాయం చేస్తారంటూ సంజూ శాంసన్ గణాంకాలను చూపిస్తున్నారు. కాగా మూడో వన్డేలో ఓటమితో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండవ స్థానానికి దిగజారింది. 113.286 రేటింగ్ పాయింట్స్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 112.638 పాయింట్లతో భారత్ ద్వితియ స్థానానికి పడిపోయింది.
Updated Date - 2023-03-23T14:42:22+05:30 IST