KCR BRS: ఒక్కటైన గల్ఫ్ సంఘాలు.. యూఏఈలో కీలక నిర్ణయం..
ABN, First Publish Date - 2023-10-17T03:22:41+05:30
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోటీ చేయనున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో గల్ఫ్ బాధిత కుటుంబాలు, గల్ఫ్ మృతుల
కామారెడ్డిలో భారీగా నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయం
సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, నిర్మల్, జగిత్యాల, బాల్కొండలోనూ బరిలోకి
గల్ఫ్ బోర్డు సాధనే లక్ష్యమని ప్రకటన
కరీంనగర్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోటీ చేయనున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో గల్ఫ్ బాధిత కుటుంబాలు, గల్ఫ్ మృతుల కుటుంబాలతో భారీగా నామినేషన్లు వేయించేందుకు దుబాయ్-అజ్మాన్‌లోని ఇండియన్ అసోసియేషన్ సిద్ధమైంది. అజ్మాన్‌లోని ఇండియన్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఆదివారం సాయంత్రం గల్ఫ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం వివరాలతో పాటు, శనివారం రాత్రి షార్జాలో జరిగిన గల్ఫ్ సంఘాల ప్రతినిధుల సమావేశం వివరాలను దుబాయి నుంచి పీచర కిరణ్‌కుమార్ ప్రకటన ద్వారా తెలియజేశారు.(పీచర కిరణ్‌కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు). గల్ఫ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో గల్ఫ్ ప్రవాసుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని గల్ఫ్ సంఘాలు ఒక్క తాటిపైకి రావాలని అభిప్రాయపడ్డారు. సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, బాల్కొండ, నిర్మల్ వంటి గల్ఫ్ వెళ్లిన వారున్న ప్రాంతాల్లో గల్ఫ్ కార్మిక నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసిన చోట భారీగా నామినేషన్లు వేయాలని, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి గల్ఫ్ సంఘాల తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓట్లు వేయించాలని నిర్ణయించారు. ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ బోర్డు సాధనే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. మిగతా అన్ని గల్ఫ్ సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని సమావేశం నిర్ణయించింది. గల్ఫ్ ప్రవాసుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ గల్ఫ్ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. శనివారం రాత్రి యూఏఈలోని షార్జాలో తెలంగాణ గల్ఫ్ సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్‌లో ఉన్న కార్మికులు, గల్ఫ్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చి గ్రామాల్లో స్థిరపడ్డ వారు కుటుంబసభ్యులతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సమావేశానికి సౌదీ నుంచి ఇద్దరు, ఒమన్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ముగ్గురు ప్రతినిధులు, యూఏఈలోని వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
Updated Date - 2023-10-17T08:45:07+05:30 IST