Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..
ABN, First Publish Date - 2023-03-28T17:27:04+05:30
రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
హైదరాబాద్: రైళ్లపై రాళ్లు రువ్వడం(Stone pelting on trains) వంటి ఘటనలు పెరుగుతుండటంతో భారతీయ రైల్వే(Indian Railway) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రయాణీకులకు గాయాలవడమేకాక రైల్వే ఆస్తులకు నష్టం కలుగుతుండటంతో కన్నెర్ర చేసింది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) విజ్ఞప్తి చేసింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని(Railways Act) సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రాళ్లు రువ్విన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవలి కాలంలో కాజీపేట- ఖమ్మం, కాజీపేట- భోంగీర్, ఏలూరు- రాజమండ్రి వంటి సమస్యాత్మక విభాగాలలో వందే భారత్ రైళ్లను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. జనవరి, 2023 నుండి రైళ్లపై రాళ్ల దాడి వంటి ఘటనలు 9 చోటుచేసుకున్నాయి. ఇటువంటి సంఘటనల వల్ల విలువైన ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లమేకాకుండా రైలు రీషెడ్యూల్‌కు దారితీశాయి. దీంతో ప్రయాణికులంతా అసౌకర్యానికి గురవుతున్నారు. రైలుపై రాళ్లు రువ్వడం తీవ్ర పరిణామాల వల్ల రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తలకు రాళ్లు తగలడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా రాళ్లను విసరటం వల్ల రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు కొన్నిసార్లు ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉంది .
ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకునేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నిరంతరం శ్రమిస్తోంది. ఇప్పటివరకు ఆర్పీఎఫ్ పలు కేసులు నమోదు చేసి 39 మంది నేరస్తులను అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న దుండగులు, భారతీయ రైల్వేల సురక్షిత నిర్వహణకు హాని కలిగిస్తున్నారని గుర్తించడం చాలా ముఖ్యం. కొన్ని రాళ్ల దాడి ఘటనల్లో 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు కూడా ఉన్నరన్న సంగతి తల్లిదండ్రులు గ్రహించడం చాలా ముఖ్యం. పిల్లలను ఇలాంటి కార్యకలాపాల పాల్పడకుండా వారిని దూరంగా ఉంచడానికి వారికి తగిన సలహాలు, సూచనలు, అవగాహాన, మార్గనిర్దేశం చేయడం సమాజంలోని ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పెద్దల బాధ్యత.
రైళ్లపై రాళ్ళూ రువ్వడం వంటి ఘటనలు జరగకుండా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అవగాహన ప్రచారాలు, ట్రాక్‌ల సమీపంలోని గ్రామాల సర్పంచ్‌లతో సమన్వయం చేయడంతో పాటు వారిని గ్రామ మిత్రలుగా చేయడం వంటి అనేక చర్యలను కూడా చేపడుతోంది. రాళ్లు రువ్వే ప్రమాద స్థలాలన్నింటిలో కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు. అలాంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారికి తెలియజేయవచ్చు. అటువంటి సంఘటనలను చూసిన వ్యక్తులు సమాచారాన్ని ఆర్ పి ఎఫ్ ద్వారా తక్షణ చర్య కోసం 139కి డయల్ చేయడం ద్వారా తెలియజేయాలని రైల్వే అధికారులు అభ్యర్థించారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ జాతీయ ఆస్తులకు నష్టం కలిగించే, ప్రయాణీకులకు తీవ్ర గాయాలు కలిగించే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పెద్దలు తమ పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, వారి చిన్నపిల్లల చేష్టల కారణంగా కలిగే తీవ్రమైన పరిణామాల గురించి వారికి అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-03-28T17:44:05+05:30 IST