Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి ఇకపై ఏరియా ఆస్పత్రి

ABN , First Publish Date - 2023-09-03T22:32:02+05:30 IST

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 3: కాగజ్‌నగర్‌ పట్టణంలోని సామాజిక ఆసుపత్రి 30పడకలతో కొనసాగుతుండగా 6రోజుల క్రితం వంద పడలక ఆసుపత్రిగా మార్పుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి ఇకపై ఏరియా ఆస్పత్రి

-100పడకల ఆస్పత్రిగా మార్పు

-అదనపు పదిపోస్టులకు ప్రతిపాదనలు

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 3: కాగజ్‌నగర్‌ పట్టణంలోని సామాజిక ఆసుపత్రి 30పడకలతో కొనసాగుతుండగా 6రోజుల క్రితం వంద పడలక ఆసుపత్రిగా మార్పుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తీసుకున్న చక్కటి నిర్ణయంతో ఈ ప్రాంత వాసులకు ఎంతగానో మేలు జరుగనుంది. ప్రస్తుతం 30పడకల ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంతోపాటు మండలంలోని వివిధ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిని అప్‌గ్రేడ్‌ చేయటంతో మరిన్ని సేవలు పెరిగే అవకాశాలున్నాయి. అప్‌గ్రేడ్‌ చేయటంతో 10వివిధ కేటగిరిల్లో పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వైద్యశాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇందులో పిడియాట్రిషియన్‌, గైనకాలజిస్ట్‌, డెంటిస్ట్‌, జనరల్‌ సర్జన్‌, ఫిజీషియన్‌, అనస్తీషియా, ఆప్తమాలజిస్ట్‌, పాతాలజిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల ప్రారంభవుతుండటంతో జిల్లా కేంద్ర ఆసుపత్రి ఇక్కడికి అటాచ్‌ కానుంది. కాగజ్‌నగర్‌లోని సామాజిక ఆసుపత్రిని అప్‌గ్రేడ్‌ చేసి జిల్లా ఆసుపత్రిగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ దిశగా అడుగులు వేస్తుండటం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో టీబీ, లిపిడ్‌ ప్రొఫైల్‌ టెస్ట్‌, యూరిక్‌ యాసిడ్‌, సీబీపీ, హిమోగ్లోబిన్‌ టెస్టులు చేస్తున్నారు. అలాగే ఆధునిక మిషనరీలతో ఎక్స్‌రేలు నిర్వహిస్తున్నారు. రెండునెలల క్రితం ఈ ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిత్యం 200 నుంచి 300 వరకు ఓపి వస్తుంటడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రద్దీగా ఉంటోంది. గతంలో ఈ ఆసుపత్రిలోనే కొవిడ్‌కు వైద్య సేవలు అందించారు. ప్రజల్లో ప్రభుత్వ వైద్యానికి మంచి క్రేజ్‌ వస్తోంది. అలాగే ఈ ఆసుపత్రిలో గర్భిణాలకు పరీక్షలు చేసి సాధారణ కాన్పులు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న సిబ్బందితో డెలివరీలు చేయిస్తున్నారు. అత్యవసర చికిత్సలకు మాత్రం బెల్లంపల్లి ఆసుపత్రికి రెఫర్‌ చేస్తున్నారు. రానున్న రోజుల్లో వివిధ విభాగాలకు సంబంధించిన డాక్టర్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తుండటంతో రెఫర్‌ కేసులు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. కాగజ్‌నగర్‌ 30వార్డులకు సంబంధించిన ప్రజలు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యపరీక్షలు చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వైద్యసేవలు పెంచే అవకాశాలుండటంతో ఈ ప్రాంత ప్రజలకు మరింత వైద్య సేవలు అందించే అవకాశాలున్నాయి.

పెరగాల్సిన సిబ్బంది..

పీహెచ్‌సీ, సీహెచ్‌సి స్థాయి నుంచి ప్రస్తుతం 100పడకల ఆసుపత్రి (ఏరియా హాస్పిటల్‌)గా మారిన కాగజ్‌నగర్‌ ఆసుపత్రిలో మరిన్ని సేవలు విస్త్త్రృతంగా జరగాలంటే సిబ్బంది సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే కేవలం 30 పడకల ఆసుపత్రికే సరిపడా సిబ్బంది లేరు. 100 పడకల ఆసుపత్రి స్థాయిలో పెంచినట్లయితే మరింత సేవలు అందించే అవకాశాలున్నాయి. గతనెల 29న వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి రిజ్వి కాగజ్‌నగర్‌ సీహెచ్‌సీని ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాన్‌రికరింగ్‌ నిధులు రూ.26కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఉత్తర్వులు వచ్చాయి..

-కృష్ణప్రసాద్‌, మెడికల్‌ ఆఫీసర్‌, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌ సామాజిక ఆసుపత్రి 100పడకల ఆసుపత్రిగా మార్పు చేస్తూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం 30 పడకల మేర చికిత్సలు అందిస్తున్నాం. వంద పడకల ఆసుపత్రి ఉంటే రానున్న రోజుల్లో పది కేటగిరిల్లో స్పెషలిస్టు డాక్టర్లు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-09-03T22:32:02+05:30 IST