శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరికతో పార్టీ శ్రేణుల్లో జోష్‌

ABN , First Publish Date - 2023-06-17T02:13:13+05:30 IST

నిర్మల్‌ నియోజకవర్గంతో పాటు ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురీత తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయంటున్నారు.

శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరికతో పార్టీ శ్రేణుల్లో జోష్‌
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శ్రీహరిరావు (ఫైల్‌)

బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా వ్యూహరచన

మూడు సెగ్మెంట్‌లలో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ

నిర్మల్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ నియోజకవర్గంతో పాటు ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురీత తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయంటున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ జిల్లా మాజీ అఽధ్యక్షులు శ్రీహరిరావు నిర్మల్‌ నియోజకవర్గంలో బలమైననేతగా గుర్తింపు పొందారు. అలాగే లక్ష్మణచాంద, మామడ మండలాల్లో ఆయనకు గట్టి పట్టుంది. ఆయన ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఇక రాజకీయ సమీకరణలు తలకిందులుకానున్నాయి. ఈ మండలాల్లో ఆయనకు పెద్దసంఖ్యలో అనుచరులు ఉన్నారు. 2018 ఎన్నికల్లో అప్పటి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి అల్లోల ఇంద్రకరణరెడ్డి గెలుపులో శ్రీహరిరావు కీలకపాత్ర పోషించారు. అలాగే 2007 సంవత్సరం నుంచి శ్రీహరిరావు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి ఆ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. ఉద్యమాన్ని ఒకవైపు ఉదృతం చేస్తూనే పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో కూడా ఆయన క్రీయాశీలక పాత్ర పోషించారు. మొదట్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి శ్రీహరిరావు ప్రధాన అనుచరునిగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాం లో ఇంద్రకరణ్‌రెడ్డి వెంట ఆయన నడిచారు. మామడ మండల జడ్పీటీసీగా, ఎంపీపీగా వ్యవహరించిన ఆయన అప్పట్లో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షునిగా కూడా కొనసాగారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి శ్రీహరిరావు నియోజకవర్గ రాజకీయాల్లోల ప్రత్యేకముద్ర వేసుకున్నారు. 2009 సంవత్సరంలో శ్రీహరిరావు బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేసి అప్పటి పీఆర్పీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2014 సంవత్సరంలో బీఎస్పీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇంద్రకరణ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో వీరిద్దరు ఒకే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో అధిష్టానం పిలుపు మేరకు శ్రీహరిరావు పార్టీ టికెట్‌ను ఆశించకుండా అప్పటి అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి మద్దతు పలికి ఆయన గెలుపుకు కృషి చేశారు. అయితే ఆ సమయంలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధిష్టానం హమీ ఇచ్చింద ని ఆ హామీని అమలు చేయకుండా తన అనుచరవర్గాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అణిచివేశాడని, తనకు పలుసార్లు అనుమానాలకు గురి చేశాడంటూ శ్రీహరిరావు బాహాటంగానే ఆరోపించారు. చాలా రోజుల నుంచి ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానంపై అలాగే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉండగా శ్రీహరిరావు, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు అత్యంత సన్నిహితులు కావడంతో ఆయన పార్టీ మారే అవకాశాలు ఉండకపోవచ్చని మంత్రి వర్గీయులు ధీమాగా ఉన్నారు. అయితే ఆత్మీ య సమ్మేళనాల సమయంలో శ్రీహరిరావు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వైఖరిని విమర్శిస్తూ మీడియాలో మాట్లాడారు. దీనిపై మంత్రి గాని పార్టీ అధిష్టానం గాని శ్రీహరిరావు విమర్శలపై స్పందించలేదు. అప్పటి నుంచి ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పలు దఫాలుగా అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన శ్రీహరిరావు చివరకు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. శ్రీహరిరావు కాంగ్రెస్‌ లో చేరబోతున్న కారణంగా ఆ పార్టీకి కొత్త ఊపు రానుందని పేర్కొంటున్నారు. మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్‌ మండలాల్లో శ్రీహరిరావు సమీకరణలను తలకిందులు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నా రు. కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటికే శ్రీహరిరావు టికెట్‌పై కూడా హామీ ఇచ్చిందని అంటున్నారు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో ఇక ప్రధాన పార్టీల నుంచి గట్టి అభ్యర్థులు బరిలో నిలబోతున్నారనేది ఆసక్తిని కలిగించబోతోంది.

మారనున్న సమీకరణలు

బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన శ్రీహరిరావు బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగ తి తెలిసిందే. అ యితే బీఆర్‌ఎస్‌ లో బలమైన నా యకునిగా గుర్తిం పు పొందిన శ్రీహరిరావు కాంగ్రెస్‌ పార్టీ లో చేరడం ఆసక్తికరంగా మారింది. ఈయన చేరిక బీఆర్‌ఎస్‌కు నష్టం చేకూరుస్తుందా లేక బీజేపీకి అనుకూలంగా మారుతుందా అనే అంశంపై ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. శ్రీహరిరావు కాంగ్రెస్‌ తరపున ఉంటే ఇక్కడ త్రిము ఖ పోటీ అనివార్యం కానుందంటున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ పార్టీ నుంచి ఏలేటీ మహేశ్వర్‌రెడ్డిలకు ఈ సారి ఆ పార్టీల అధిష్టానాలు టికెట్‌లు దాదాపుగా ఖరారు చేసినట్లేనంటున్నా రు. వీరికి ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి శ్రీహరిరావు కూడా బరిలో నిలిచే అవకాశాలుంటాయి. శ్రీహరిరావుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇప్పటికే టికెట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కూడా శ్రీహరిరావుని అభ్యర్థిగా బలపరుస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బలాలు, బలహీనతలన్నీ శ్రీహరిరావుకు తెలుసునని అందుకు తగ్గట్లుగా రాబోయే ఎన్నికల్లో ఆయన వ్యూహ ప్రతివ్యూహాలు రచించే అవకాశాలు ఉంటాయంటున్నారు. అయితే ఇప్పటి వరకు మైనార్టీ ఓట్లపై ధీమాగా ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రీహరిరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో కొంత ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఇదిలా ఉండగా మైనార్టీ ఓట్లు రెండువైపులా చీలిపోతే బీజేపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందు కోసం ప్రయత్నించవచ్చంటున్నారు. ఇప్పటి వరకు మైనార్టీ ఓట్లపై బీఆర్‌ఎస్‌ పెద్దగా ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి లభించడంతో ఆ వర్గం ఓట్లు రెండు వైపులా పోలయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు. దీంతో మెజార్టీ వర్గ ఓట్లను ఎక్కువ సంఖ్యలో తాము పొందితే గెలుపు సులభం అవుతుందని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఖానాపూర్‌, ముథోల్‌లో పోటాపోటీ

ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఈ సారి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసేందుకు చాలా మంది నేతలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే వీరంతా పోటాపోటీ కార్యక్రమాలతో పల్లెలను చుట్టుముడుతున్నారు. రేవంత్‌రెడ్డికి సన్నిహితునిగా గుర్తింపు పొందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మబొజ్జు, ఉట్నూర్‌ జడ్పీటీసీ చారులత రాథోడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ ఖానాపూర్‌ నియోజకవర్గ అధ్యక్షులు గుగ్లావత్‌ కిషోర్‌ నాయక్‌, ఎస్టీ సెల్‌ రాష్ట్ర నాయకులు భరత్‌చౌహాన్‌లతో పాటు తదితరులు ఈ సారి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇప్పటి నుంచే వీరంతా టికెట్‌ కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. అయితే ముథోల్‌ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటి వరకు ఆ పార్టీ కదలికలు ఆశించిన మేరకు కనిపించకపోయినప్పటికి శ్రీహరిరావు కారణంగా కదలిక మొ దలైందంటున్నారు. ఇక్కడి ఓ మాజీ ఎమ్మెల్యేతో శ్రీహరిరావు సంప్రదింపులు జరుపు తూ ఆయనను కాంగ్రెస్‌ తరపున బరిలోకి దింపే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని చెబుతున్నారు. శ్రీహరిరావు తన నియోజకవర్గమైన నిర్మల్‌తో పాటు ఖానాపూర్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయడమే కాకుండా బలమైన అభ్యర్థులను గుర్తిం చే పనిలో నిమగ్నమయ్యారంటున్నారు.

Updated Date - 2023-06-17T02:13:13+05:30 IST