CM Revanth Reddy: డ్రగ్స్ చెలామణిపై ఉక్కుపాదం
ABN, First Publish Date - 2023-12-11T21:34:26+05:30
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటలిజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించడంతోపాటు ఆ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు . ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీఎస్ నాబ్ ను తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - 2023-12-11T21:34:27+05:30 IST