Ponguleti Srinivasreddy: నా అల్లుడిని బెదిరించారు... మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి?.. ఐటీ ఆఫీసర్స్‌పై పొంగులేటి ఫైర్
ABN, First Publish Date - 2023-11-10T14:11:19+05:30
Telangana Elections: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీస్, నివాసాల్లో ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఐటీ అధికారుల ప్రవర్త సరిగా లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఐటీ అధికారులు పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Former MP Ponguleti Srinivas Reddy) ఆఫీస్, నివాసాల్లో ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఐటీ అధికారుల ప్రవర్తన సరిగా లేదని పొంగులేటి మండిపడ్డారు. ఐటీ అధికారులు పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ... ‘‘నాపైనా, కుటుంబ సభ్యులకు చెందిన 30 కంపెనీలపై ఐటీ దాడులు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఇది ప్రజా స్వామ్యమా?... ప్రజాస్వామ్యబద్దంగా అధికారపక్షాలు పని చేస్తున్నారా?....ఆలోచన చేయాలి. అధికారిక ప్రభుత్వం ఒత్తిడితో ఐటీ దాడులు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది అని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భయంతో అధికార పార్టీలు దాడులు చేయిస్తున్నాయి. కాంగ్రెస్‌ను అధికారంలోకి రానీయకుండా ఫెవికాల్ బంధం ఉన్నా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి దాడులు చేస్తున్నారు. స్వయానా నా అల్లుడిని బెదిరించారు. నా ఆఫీసు అకౌంటెంట్‌పై థర్డ్ డిగ్రీకి పాల్పడ్డారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఒంటి కాలు మీద నిలబెట్టారు.. దారుణంగా బెదిరించారు. ఐటీ అధికారులు పరిధిని దాటి వ్యవహరించటం దుర్మార్గం. ఐటీ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం ఏమిటి?.. మీకు ఏమైనా దొరికితే కేసులు పెట్టండి. ఐటీ అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు హద్దులలో ఉండాలి... మీ రూల్స్ తెలియని వారు ఎవరు లేరు ఇక్కడ. నిబంధనలు ఉల్లంఘించిన మీరు కూడా దోషులు అవుతారు. బీఆర్ఎస్‌పై స్వరం పెంచిన తరువాత.. నాతో పాటు అనేక మంది వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టారు ఓర్చుకున్నాం. మా కంపెనీలపై దాడులు చేశారు... అనుమతి ఇచ్చిన ప్రాజెక్టును ఆపివేశారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు... రిటర్న్ గిఫ్ట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజలు ఇస్తారు. అసలు గిఫ్ట్.. కేంద్రంలో ఇవ్వబోతున్నారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యలు చేశారు.
అలాగే కాంగ్రెస్ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ శ్రేణులకు విన్నపం... సమయం తక్కువ ఉంది... కేసులతో ఇబ్బందులు పడుతున్న వారికి విముక్తి ఉండబోతుంది. 20 రోజుల పాటు కష్టపడి పని చేయాలి’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.
Updated Date - 2023-11-10T15:54:51+05:30 IST