Minister Sridhar Babu : ఈనెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ABN, First Publish Date - 2023-12-07T21:01:06+05:30
ఈనెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ( Minister Sridhar Babu ) స్పష్టం చేశారు. గురువారం నాడు సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ గురించిన వివరాలను మీడియాకు శ్రీధర్‌బాబు తెలిపారు.
హైదరాబాద్: ఈనెల 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ( Minister Sridhar Babu ) స్పష్టం చేశారు. గురువారం నాడు సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ గురించిన వివరాలను మీడియాకు శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ...‘‘కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారెంటీలతో పాటు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాం. ఐదేళ్లలో మార్పు చూపెడతాం. 2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఎంత ఖర్చు పెట్టారని శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను ఆదేశించాం. గ్యారెంటీల విషయంలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. రెండు గ్యారెంటీలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు. ఆ రెండు గ్యారెంటీలపై సీఎం చర్చించి 9వ తేదీన అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది’’ అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
ఈనెల 9న అసెంబ్లీ
‘‘24 గంటలు కరెంట్ రైతులు, పరిశ్రమలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 2014 నుంచి పవర్ విషయంలో అనేక తప్పులు జరిగాయి. దీనిపై సుదీర్ఘంగా చర్చించాం. రేపు విద్యుత్ అధికారులతో సీఎం రివ్యూ చేస్తారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈనెల 9వ తేదీన అసెంబ్లీని నిర్వహిస్తాం. ఆరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రైతు బంధుకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నుంచి వివరాలు కోరాం. వివరాలు రాగానే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మంత్రి వర్గ కూర్పుపై ముఖ్యమంత్రి, మా పార్టీ హై కమాండ్ నిర్ణయమే తీసుకుంటుంది’’ అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
Updated Date - 2023-12-07T21:56:43+05:30 IST