Siddaramaiah: కేసీఆర్ తెలంగాణను అప్పుల మయం చేశాడు
ABN, First Publish Date - 2023-11-26T21:54:43+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలో సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలో సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘‘ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌కు అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నాను. నవంబర్ 30వ తేదీన తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించాలి. గత పదేళ్లుగా ప్రజలను కేసీఆర్ వంచించాడు. అన్నివర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు. కేసీఆర్‌ను గద్దె దింపి, కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలి. దేశంలో అన్నివర్గాలను , అన్ని కులమతాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. స్వాతంత్ర్య కోసం , పేద ప్రజలకు అధికారం ఇచ్చేందుకు బీజేపీ పార్టీ ఎప్పుడు పని చేయలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదు. పార్లమెంట్లో ఆయనకు ఎంపీలు లేకపోయినా సోనియాగాంధీ ధైర్యం చేసి రాష్ట్రాన్ని ఇచ్చింది’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
బీజేపీ , బీఆర్ఎస్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాయి
‘‘పదేళ్లుగా ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఎస్సీ , ఎస్టీ , మహిళలు , రైతులకు , యువతకు ఎలాంటి న్యాయం చేయలేదు. రాష్ట్ర సంపదను కేసీఆర్ ఆయన కుటుంబం లూటీ చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర అప్పు 75 వేల కోట్లు... 10 ఏళ్లలో కేసీఆర్ 5 లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పు చేశాడు. ఒక్కొక్కరిపై కేసీఆర్ 95 వేల రూపాయల అప్పు చేశాడు. ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు. ఆ రాజ్యాంగాన్ని 100 శాతం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీనే. దాన్ని తుంగలో తొక్కేది బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు. రాజ్యాంగం కారణంగానే అన్నివర్గాల ప్రజలకు సమాన హక్కులు లభిస్తున్నాయి. కానీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నాయి. నేను ముఖ్యమంత్రి, నరేంద్రమోదీ ప్రధాని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది ఆ రాజ్యాంగం వల్లనే. రాజ్యాంగం లేకపోతే రాచరికం వస్తుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి , ఆ బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ , బీజేపీను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలి. బీఆర్ఎస్ , బీజేపీ పార్టీకు తేడా లేదు. రెండు పార్టీల వైఖరి ఒక్కటే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు , వ్యాపారుల వద్ద పన్నులు తీసుకొని , ప్రజల వద్ద తక్కువ తీసుకొనే వాళ్లం... కానీ ఇప్పుడు పేదలపై అధిక భారం వేసి... బడా బాబులకు రాయితీలు ఇస్తున్నారు’’ అని సిద్ధరామయ్య తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం దివాళా తీసిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు
‘‘అంబానీ, ఆదానీ వద్ద నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ 30 శాతం పన్నులు వసూలు చేసింది.. కానీ నరేంద్రమోదీ వచ్చిన తర్వాత 22 శాతానికి తగ్గించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు తక్కువ ధరకు దొరికేవి , కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో గ్యాస్ 4 వందలు ఉండేది... కానీ ఇప్పుడు 12 వందలు అయింది. కర్ణాటకలో డీజల్ , పెట్రోల్ ధరల కంటే తెలంగాణలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ డబ్బులన్ని కేసీఆర్ ఖాతాలోకి వెళ్తున్నాయి. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది.. అందుకే కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చాము. ఈ హామీలు ఇస్తే కర్ణాటక రాష్ట్రం దివాళా తీస్తుందని నరేంద్రమోదీ అన్నారు. కానీ ప్రధానికి ఛాలెంజ్ చేసి , ఇప్పుడు 4 గ్యారెంటీలు అమలు చేశాము... ఇంకో గ్యారెంటీ యువ నిధి పేరిట నిరుద్యోగులకు 3000 జనవరి నుంచి అందజేసి అది కూడా అమలు చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తుంది. కర్ణాటకలో తాము అమలు చేస్తున్న గ్యారెంటీలను ముఖ్యమంత్రి కేసీఆర్ , కేటీఆర్‌లు అమలు కావడం లేదని అబద్ధాలు చెప్తున్నారు. వాళ్లకు ఛాలెంజ్ చేస్తున్న కర్ణాటకకు వచ్చి చూడాలి... కానీ వాళ్లకు కర్ణాటక వచ్చే ధైర్యం లేదు... అందుకే ప్రజలను మభ్యపెడుతున్నారు. కేసీఆర్ , మోదీకు ఓడిపోతామనే భయం ప్రారంభమైంది. బీఆర్ఎస్ కథ ముగిసింది. బీజేపీ 3 సీట్లకు మించి రావు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో , రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కూడా అంతే నిజం’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-26T21:54:45+05:30 IST