Etala Rajender: బీఆర్‌ఎస్ డబ్బు సంచులతో పని మొదలు పెట్టింది..
ABN, First Publish Date - 2023-08-26T11:19:57+05:30
రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగుచెందారని, ఆయనను పాలన వద్దనుకుంటున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ
ఖమ్మం: రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగుచెందారని, ఆయనను పాలన వద్దనుకుంటున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Huzurabad MLA Etala Rajender) అన్నారు. ఈనెల 27న సాయంత్రం ఖమ్మంలో జరిగే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం ఆయన ఖమ్మం వచ్చారు. ఈసందర్భంగా ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాలుగు నెలలుగా అధికార దుర్వినియోగం చేస్తూ డబ్బుసంచులతో రాజకీయం మొదలుపెట్టిందన్నారు. ఖమ్మం వ్యవసాయ అగ్రగామిగా ఉన్న జిల్లా అని, ఇక్కడ రైతులకు ఎలాంటి న్యాయం జరగడంలేదన్నారు. ఎండు మిర్చికి ధర తక్కువగా ఉందని, ప్రశ్నించిన రైతులకు బేడీలు వేసి జైళ్లకు పంపిన ఘనత ఈ ప్రభుత్వానిదని మండిపడ్డారు. జిల్లాలో గిరిజనులు అత్యధికంగా ఉన్నారని, ప్రభుత్వం వారికి మోసపూరిట మాటలు చెబుతూ వారికి ఉన్న పోడుభూములను చేస్తోందన్నారు. గిరిజన రైతులు అటవీఅధికారుల కాళ్లమీద పడి తమకు భూములు కేటాయించాలని అడిగితే, వారిని వారిని బూటుకాలితో అధికారులు తన్నారని, కనీసం గోడు వినలేని స్థితిలో ఈప్రభుత్వం ఉందన్నారు. ఇక్కడి పండించిన వరికి సరైన ధర లేక రైతులు వరికుప్పల దగ్గర పడుకుంటున్నా రని, ధాన్యం అమ్మాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని, ఇది సిగ్గులేనితనమని విమర్శించారు.
తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని పట్టించుకోని సీఎం కేసీఆర్ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో చెక్కులు పంచుతున్నారని మండిపడ్డారు. రైతులకు సబ్సిడీ పనిముట్లు ఇవ్వకుండా మోసంచేస్తున్నారని అన్నారు. దేశంలో ఎలాంటి స్కాంలు లేని పార్టీ బీజేపీ అని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఈటల అన్నారు. ఈ జిల్లాకు చెందిన మంత్రి పేరుకు కమ్యూనిస్టు కుటుంబమని చెప్పుకొంటున్నాడని, కానీ పచ్చి ఫ్యూడల్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆదివారం మధ్యాహ్నం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఖమ్మంలో భారీ బహిరంగసభకు హాజరుకానున్నారని, ఈసభకు ఉమ్మడి జిల్లానుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈసభ తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బయటపడే మార్గం సూచించే దిక్సూచిలా ఉండబోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు గంటేల విద్యాసాగర్, డి.సత్యనారాయణ, దేవకి వాసుదేవరావు, ఉప్పల శారద, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్యామ్‌రాథోడ్, నున్న రవికుమార్, రుద్రప్రదీప్, మంద సరస్వతి, ఖమ్మం అసెబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
అమిత్‌షా సభకు విస్తృత ఏర్పాట్లు
ఆదివారం జరిగే అమిత్‌షా బహిరంగసభ కోసం ఖమ్మం ఎస్సార్‌అండ్ బీజీఎన్నార్ కళాశాల మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సభావేదికతో పాటు కార్యకర్తలు, నాయకుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఈ ఏర్పాట్లను ఈటల రాజేందర్‌తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పరిశీలించారు.
Updated Date - 2023-08-26T11:19:57+05:30 IST