50 వేల మెజారిటీతో గెలుస్తా
ABN , First Publish Date - 2023-10-25T03:04:57+05:30 IST
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి తాను 50వేల మెజారిటీతో గెలుస్తానని, ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలు వదిలేస్తానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

హుజూర్‌నగర్‌లో ఒక్క ఓటు తగ్గినా
రాజకీయాలు వదిలేస్తా
సోనియా రుణం తీర్చుకోవాలి
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 75 సీట్లు పక్కా
నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్, అక్టోబరు 24: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి తాను 50వేల మెజారిటీతో గెలుస్తానని, ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలు వదిలేస్తానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరగా, ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రావడంతో పాటు రాహుల్‌గాంధీ ప్రధాని అవడం ఖాయమని జోస్యం చెప్పారు. అనేకసార్లు ప్రధాని పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప నేత రాహుల్‌గాంధీ అని, అలాంటి ఆయన్ను విమర్శించే స్థాయి మంత్రి కేటీఆర్‌కు, కవితకు లేదని అన్నారు. కవిత లిక్కర్ కేసులో చిక్కుకుని తెలంగాణ ప్రజల పరువుని ఢిల్లీలో తీశారని విమర్శించారు. నవంబరు 30న దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో 75 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ర్టాన్ని ప్రకటించారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణాన్ని తీర్చుకోవాలని ఉత్తమ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఈ దేశ ప్రజల కోసం అనేక త్యాగాలు చేశారని, అలాంటి వారిని కేసీఆర్ కుటుంబం విమర్శించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ అంటేనే కుటుంబ పార్టీ అని, ఆ కుటుంబంలో ఎంతోమంది మంత్రి పదవులు అనుభవిస్తూ తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రాహుల్, ప్రియాంకగాంధీ సభలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.