Share News

Gachibowli: ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

ABN , Publish Date - Mar 08 , 2025 | 05:08 AM

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) జంక్షన్‌ నుంచి ఔటర్‌ రింగు రోడ్డు (ఎగ్జిట్‌ నంబర్‌ 1)కు దగ్గర్లో ఉన్న జీఏఆర్‌ రోటరీ వరకు 5 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్‌ నిర్మించాలని సర్కారు భావిస్తోంది.

Gachibowli: ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

  • వేలం భూముల ధర పెంపునకు మౌలిక సదుపాయాల కల్పన

  • గచ్చిబౌలిలోని ఐఐఐటీ నుంచి ఓఆర్‌ఆర్‌ దగ్గర్లోని జీఏఆర్‌ వరకూ

  • ఐదు కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో ఫ్లై ఓవర్‌ లేదా ఎలివేటెడ్‌ కారిడార్‌

  • డీపీఆర్‌, సాధ్యాసాధ్యాల నివేదికకు టెండర్లు ఆహ్వానించిన టీజీఐఐసీ

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) జంక్షన్‌ నుంచి ఔటర్‌ రింగు రోడ్డు (ఎగ్జిట్‌ నంబర్‌ 1)కు దగ్గర్లో ఉన్న జీఏఆర్‌ రోటరీ వరకు 5 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్‌ నిర్మించాలని సర్కారు భావిస్తోంది. కనీసం ఆరు వరుసలతో దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు, అప్రోచ్‌ రోడ్లు, జంక్షన్లు, వీధి లైట్లు, డ్రైనేజీ, పాదచారులు నడిచేందుకు వీలుగా ఫుట్‌పాత్‌, పార్కింగ్‌, ఇతర మౌలిక వసతులను కల్పించనుంది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)తోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్న సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందుకు ఫీజిబులిటీ రిపోర్టును తయారు చేసేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీఐఐసీ) ఏజెన్సీల నుంచి శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది. ఇందుకు కారణం లేకపోలేదు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25 (పి) పరిధిలోని 400 ఎకరాలను వేలం వేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రియల్‌ ఎస్టేట్‌ పరంగా ఇప్పటికే ఈ ప్రాంతం హాట్‌ కేక్‌. ఇక్కడి భూమిని తొలుత ఒక్కో ఎకరం రూ.75 కోట్లకు విక్రయించాలని సర్కారు భావించింది.


అయితే, మౌలిక సదుపాయాలను కల్పిస్తే భూముల ధర పెరిగే అవకాశం ఉందని, తద్వారా ఎకరం కనీసం రూ.100 కోట్లకు తగ్గకుండా ధర పలుకుతుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కోకాపేట ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఆర్థిక వనరుల సమీకరణ కోసం భూములను వేలం వేసిన విషయం తెలిసిందే. అప్పట్లో అక్కడ ఎకరం రూ.100 కోట్లకుపైగా పలికింది. ఇందుకు కారణం అక్కడున్న మౌలిక సదుపాయాలే. ఈ నేపథ్యంలోనే, కంచ గచ్చిబౌలి పరిధిలో వేలం వేయబోయే భూముల చుట్టూ వివిధ రకాల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ ప్రాంతంలో మెట్రో రైల్‌ను విస్తరించినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా 5 కిలోమీటర్ల మేర కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తోంది. ఈ మేర కు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో టీజీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది. వీటి దాఖలుకు మార్చి 28 మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఇచ్చింది. అదే రోజు సాయంత్రం సాంకేతిక బిడ్లను తెరవనున్నట్టు టెండర్‌ నోటీ్‌సలో పేర్కొంది. మొత్తం 5 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్‌, జంక్షన్లు, అప్రోచ్‌ రోడ్లను నిర్మించనుండగా.. డీపీఆర్‌ రిపోర్టు వచ్చాక దీనికి ఎంత ఖర్చవుతుందనే అంశంపై స్పష్టతరానుంది.


భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని..

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐఐఐటీ-ఓఆర్‌ఆర్‌ మార్గంలో పలు రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని టెండర్‌ నోటీసులో ఇచ్చిన రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌లో (ఆర్‌ఎ్‌ఫపీ) పొందుపర్చింది. రాబోయే 15, 20 ఏళ్లలో పెరిగే ట్రాఫిక్‌తోపాటు జనసాంద్రత, కాలుష్యం ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని వీటిని కల్పించనున్నారు. హైదరాబాద్‌వాసులు ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. అభివృద్ధి చెందుతున్న కంచ గచ్చిబౌలిలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా సర్కారు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌- ఐఐఐటీ మధ్య ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ చాలా ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ రెండు జంక్షన్లు ఉన్నా.. ట్రాఫిక్‌ రద్దీ తగ్గడం లేదు. దీనికి విరుగుడుగా ఫ్లై ఓవర్‌ లేదా ఎలివేటెడ్‌ కారిడార్‌ లేదా అండర్‌ పాస్‌లను నిర్మించాలని భావిస్తోంది. వీటిలో దేనిని నిర్మించాలి? ఏదైతే ట్రాఫిక్‌ రద్దీ తగ్గేందుకు అవకాశం ఉంటుందనే దానిపై డీపీఆర్‌లో ఇవ్వాలని సూచించింది. మౌలిక సదుపాయాల కల్పనతో ఒక్కో ఎకరం ధర తొలుత భావించిన దానికంటే అదనంగా పెరిగితే.. సర్కారు ఖజానాకు వేలం ద్వారా వచ్చే రాబడి కూడా పెరుగుతుందని భావిస్తోంది.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 05:08 AM