ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఆ నియోజకవర్గాల్లో వారే కింగ్‌ మేకర్లు.. ఒక్కో చోట ఒకరు..! వారి ఓట్లే కీలకం

ABN, First Publish Date - 2023-11-17T08:37:01+05:30

నగరంలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

- మల్కాజిగిరిలో మహిళలు..

- ఎల్‌బీనగర్‌లో ఆ రెండు సామాజిక వర్గాలు..

- శేరిలింగంపల్లిలో ఐటీ, మైనారిటీలదే హవా

- కూకట్‌పల్లిలో తెలంగాణేతరులు..

నగరంలోని అసెంబ్లీ నియోజకవర్గాలు వేటికవే ప్రత్యేకం. అక్కడి ఓటర్లూ అంతే. కొన్ని నియోజకవర్గాల్లో అక్కడి బలమైన సామాజిక వర్గం కీలకంగా మారుతుంది. కొన్నిచోట్ల నగరంలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న తెలంగాణేతరులు అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తూ కింగ్‌మేకర్లుగా వ్యవహరిస్తున్నారు. నగరంలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో పార్టీలూ ఆ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి బరిలో నిలుపుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో మహిళల ఓట్లు అభ్యర్థుల జయాపజయాలను నిర్దేశించే స్థాయిలో ఉన్నాయి.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నగరంలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. తాము పోటీ చేస్తున్న నియోజక వర్గంలో ఎవరి ఓట్లు కీలకమో తెలుసుకుని వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఎల్‌బీనగర్‌లో ‘పొరుగు’ ప్రభావం

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో స్థానికులతో పాటు కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాలకు చెందిన ఓటర్లు స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. వారి ఓట్లు ఇక్కడ కీలకం కాబోతున్నాయి. మొత్తం 48 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచిన ఈ నియోజకవర్గంలో మొత్తం 5.66 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంది. ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందాలన్నా తెలంగాణేతరుల ఓట్లు కీలకం. ఈ నియోజకవర్గంలో 50 వేల వరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉంటారని, వారు కీలకంగా మారతారని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసిన సుధీర్‌రెడ్డి తన సామాజికవర్గం ఓట్లతో సునాయాసంగా విజయం సాధించారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కీగౌడ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి స్థానికుడు కావడంతో ఆయనపై కొంత సానుభూతి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్న రంగారెడ్డి ఆ ఓటు బ్యాంకు తనకే లాభిస్తుందని ధీమాతో ఉన్నారు. ఇక్కడ ప్రభావం చూపే సామాజిక వర్గ ఓట్లను ఎవరు దక్కించుకుంటారో వారే విజయం సాధించే అవకాశం ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

కూకట్‌పల్లిలో తెలంగాణేతరులదే గుత్తాధిపత్యం

కూకట్‌పల్లిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను శాసించేది తెలంగాణేతరులే.. ఈ నియోజకవర్గంలో ఓటరు తీర్పు ప్రతిసారి విభిన్నంగానే ఉంటోంది. గత మూడు ఎన్నికల్లోనూ వేర్వేరు పార్టీల అభ్యర్థులను గెలిపించారు. ఈసారి ఓటు ఎవరికి వేయాలో ఇప్పటికే ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. గత అక్టోబర్‌ నెలలో నమోదైన 25వేల మంది కొత్త ఓటర్లు కూడా గెలుపోటములను శాసించబోతున్నట్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అనూహ్యంగా మారుతున్న పరిణామాలు ఎవరి కొంప ముంచుతాయోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు భయపడుతున్నారు.

మైనారిటీ ఓట్లు ఎటు మళ్లితే అటే...

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు కీలకంగా మారాయి. ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్‌, బోరబండ, షేక్‌పేట ప్రాంతాల్లో మైనారిటీలు ఎక్కువ. నియోజకవర్గంలో 3.75 లక్షల మంది ఓటర్లు ఉంటే వారిలో 1.10 లక్షల మంది మైనారిటీలే ఉన్నారు. మైనారిటీ ఓట్లు తమకే పడతాయనే ధీమాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఉండగా, కాంగ్రెస్‌ అనూహ్యంగా ఆ వర్గానికి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను ఎన్నికల బరిలో నిలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. మైనారిటీ ఓట్లు కాంగ్రె్‌్‌సకు పడకుండా చేసేందుకే ఎంఐఎం అభ్యర్థిని బరిలో నిలిపిందనే ఆరోపణలున్నాయి. కీలకంగా మారిన మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‏కు పడతాయా.? లేకుంటే ఆ ఓట్లను ఎంఐఎం చీల్చుతుందా.? అనే సందేహాలున్నాయి.

శేరిలింగంపల్లిలో ఐటీ, మైనారిటీలదే హవా..!

ఐటీ కంపెనీలకు అడ్డాగా మారిన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఈసారి ఐటీ ఉద్యోగులు ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉన్నారు. ఇక్కడ నివసిస్తున్న ఐటీ ఉద్యోగుల్లో తెలంగాణేతరులే అధికం. ఇటీవల ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలకు ఐటీ ఉద్యోగులు స్పందించిన తీరుపై కొన్ని పార్టీల అభ్యర్థుల్లో గుబులు నెలకొంది. ఓసీల్లో ప్రధానమైన వర్గాల వారు, బీసీలు, మైనారిటీల ఓటుబ్యాంకు ఈసారి ఓ పార్టీకి అనుకూలంగా మారబోతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో నిన్నమొన్నటి వరకు తమదే గెలుపని భావించిన అభ్యర్థుల్లో గుబులు మొదలైంది.

రాజేంద్రనగర్‌లోనూ..

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో 5.52 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో లక్షకు పైగా మైనారిటీ ఓట్లే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో వారే గెలుపోటములను శాసించే అవకాశాలున్నాయి. ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నా మైనారిటీల ఓట్లే కీలకంగా మారతాయని విశ్లేషకులు అంటున్నారు. బీసీ ఓటర్లను ఆకర్షించడానికి బీఆర్‌ఎస్‌ ప్రకాష్ గౌడ్‌ను, కాంగ్రెస్‌ నరేందర్‌ ముదిరాజ్‌ను ఎన్నికల బరిలో నిలిపాయి. బీజేపీ అభ్యర్థిగా తోకల శ్రీనివా్‌సరెడ్డి పోటీ చేస్తున్నారు. మైనారిటీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో నిలిచింది. మైనారిటీ ఓట్లు ఏ పార్టీకి పడతాయనేది ఆసక్తికరంగా మారింది.

మల్కాజిగిరిలో మహిళా ఓటర్లే కీలకం

మల్కాజిగిరి బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేది మహిళా ఓటర్లేనని స్థానికంగా చర్చ జరుగుతోంది. మల్కాజిగిరిలో మొత్తం ఓటర్లు 4.89 లక్షలు కాగా, అందులో పురుషులు 2.46 లక్షలు, మహిళా ఓటర్లు 2.42 లక్షల మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో సగం ఓటర్లు మహిళలే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. మహిళలకు అనుకూలంగా ఉన్న పథకాలను ప్రచారంలో వివరిస్తున్నారు.

Updated Date - 2023-11-17T08:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising