30 వేల ఎకరాల సర్కారు భూములను అమ్ముకుంటున్నరు
ABN , First Publish Date - 2023-05-18T03:53:33+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన భూములను కారుచౌకగా అమ్ముతోంది.

బడా కంపెనీలకు విలువైన భూములు
ప్రతిగా డబ్బు దండుకుంటున్న కేటీఆర్
మేం వస్తే ఆ భూములు వెనక్కి: భట్టి
రాజకీయ ఎదుగుదల కోసమే కేసీఆర్
భూముల అమ్మకం: ఆర్‌ఎస్ ప్రవీణ్
రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు: షర్మిల
నవాబ్‌పేట/హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన భూములను కారుచౌకగా అమ్ముతోంది. 30 వేల ఎకరాల సర్కారీ భూములను కూడా అమ్మకానికి పెట్టింది’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రి కేటీఆర్ బడా కంపెనీలకు విలువైన భూముల్ని కట్టబెడుతూ.. సీఈవోలా వాటి నుంచి డబ్బులు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మిగులు ఆదాయంతో ప్రజలు కేసీఆర్‌కు అప్పగిస్తే హారతి కర్పూరంలా ఆస్తులను అమ్మి.. అదీ చాలక రూ. 5లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేపూర్తిచేశామని చెప్పారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామని, ఇప్పుడు అమ్ముతున్న ప్రభుత్వ భూములను తిరిగి తీసుకొని పేదలకు పంచుతామని ఆయన చెప్పారు. పాదయాత్ర లో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం కేసీఆర్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిబంధనలను అతిక్రమించి ఏపీకి చెందిన బీఆర్‌ఎస్ నేతకు మియాపూర్‌లో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ‘సర్కార్ రియల్ బేరం’ పేర ప్రచురితమైన కథనాన్ని ట్విటర్‌లో షేర్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 111 జీవోను ఎత్తివేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల భూములను బినామీ కంపెనీలకు అప్పజెప్పారని మండిపడ్డారు. రాబోయే బహుజన రాజ్యంలో ఆ భూములన్నింటినీ ప్రజలపరం చేస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం వచ్చే ఎన్నికల్లోభూ బకాసురులను ఓడించడానికి ప్రజ లు అడుగు ముందుకెయ్యాలని ఆయన కోరారు. మరోవైపు.. కేసీఆర్‌కు అధికారమిస్తే తెలంగాణ మొత్తాన్ని అమ్మకానికి పెడుతున్నారని, జీవోలతో భూములు అమ్మేసి వేల కోట్లు వెనకేస్తున్నారని వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. రైతులకిచ్చిన అసైన్డ్ భూములను, పరిశ్రమలకిచ్చిన భూములనూ సైతం వదలడం లేదన్నారు. 2014లో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములు, ఇప్పుడున్న భూములపైన శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్ చేశారు.