Rajasingh: తీరుమార్చుకోని రాజాసింగ్... కమ్యూనిటీలపై వ్యాఖ్యలు.. మరో కేసు నమోదు
ABN, First Publish Date - 2023-04-01T12:49:13+05:30
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనేక కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) పై అనేక కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఏదో ఒక చోట, ఏదో ఒక కార్యక్రమంలో మతం, కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ రెండు రోజుల క్రితం రాజాసింగ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ రాజాసింగ్ తన తీరును మార్చుకోలేదు. యాధావిధగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతూనే ఉన్నారు. తాజాగా రాజాసింగ్ చేసిన మరో స్పీచ్‌పై కేసు నమోదు అయింది. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగంపై ఎస్సై వీరబాబు అభ్యంతరం తెలిపారు. తన కొడుకుని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీలపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఎస్సై వీర బాబు ఫిర్యాదు చేశారు. దీంతో రాజాసింగ్‌పై 153-ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు.
కాగా.. 2023, జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ 1(ఏ) కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే వ్యాఖ్యలపై రాజాసింగ్‌కు హైదరాబాద్ పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు. ఓ కేసులో బెయిల్ ఇచ్చే క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు షరతు విధించిందని ఆ నోటీసులో గుర్తుచేశారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. అలాగే 2022 అక్టోబర్‌లో హైదరాబాద్ శిల్పారామంలో కమెడియన్ మునావర్ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోకు అనుమతి ఇవ్వడంపై రాజాసింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం నేతలు ఆరోపించారు. పలు ముస్లిం సంఘాలు ఆందోళనలు కూడా నిర్వహించారు. రాజాసింగ్‌పై నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు పీడీయాక్ట్‌ను నమోదు చేసి జైలుకు పంపించారు. ఆ కేసులో గతేడాది నవంబర్ 9న హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
Updated Date - 2023-04-01T14:54:57+05:30 IST