Bhatti Vikramarka: రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారు... అందుకే
ABN, First Publish Date - 2023-07-31T16:10:11+05:30
భారీ వర్షాలు వస్తాయని ముందే హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: భారీ వర్షాలు వస్తాయని ముందే హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో లేనప్పటికీ వాటిని ముందే పసిగట్టి ప్రజలను జాగ్రత్త పరిచే అవకాశం ఉందన్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ (CM KCR) వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టులు సాంకేతికతో కాకుండా రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం కట్టారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram Project) ఇంజనీర్ కేసీఆరే అని అన్నారు. కేసీఆర్ రాత్రి పూట డిజైన్ చేసి మూడు చెక్ డ్యాంలకు ప్లాన్ గీశారని.. అడ్డగోలుగా చెక్ డ్యాంలు కట్టడం వల్లే ఇంత ప్రమాదం జరుగుతోందన్నారు. రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాలకు ప్రత్యేక విమానాలు పంపి, నాయకులను రప్పించుకొని కండువాలు కప్పుతారని యెద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. ఒక హెలికాప్టర్ ఇవ్వండి అంటే మాత్రం స్పందించరన్నారు. కేసీఆర్ అనాలోచిత డిజైన్ వల్ల ప్రజలు మునిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రాంతాలకు అధికారులను పంపి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. ప్రజలను మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటు అయిందన్నారు. కేసీఆర్ రాముడిని కూడా మోసం చేశారన్నారు. మోసం చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దించేలా చూడమని రాముడ్ని మొక్కుతున్నానని అన్నారు. నష్టపోయిన ప్రజలకు వెంటనే నష్టపరిహారం అందించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
Updated Date - 2023-07-31T16:10:11+05:30 IST