EMset Counselling: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో తడబాటు

ABN , First Publish Date - 2023-07-18T04:26:51+05:30 IST

టీఎస్‌ ఎంసెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో అధికారులు తప్పటడుగు వేశారు. దీంతో జేఎన్‌టీయూ, ఓయూ పరిధిలోని కాలేజీల్లో బీటెక్‌ బయో టెక్నాలజీ సీట్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం ఏర్పడింది.

 EMset  Counselling: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో తడబాటు

బయోటెక్నాలజీ సీట్ల కేటాయింపులో గందరగోళం

బైపీసీ కోటా సీట్లు ఎంపీసీ అభ్యర్థులకు కేటాయింపు

లబోదిబోమంటున్న బైపీసీ విద్యార్థులు, తల్లిదండ్రులు

ఎంపీసీ, బైపీసీకి చెరి సగం ఇవ్వాలని జేఎన్‌టీయూ లేఖ

కానీ ‘కమ్యూనికేషన్‌ గ్యాప్‌’తో అమలు కాని ఆదేశాలు!

జేఎన్‌టీయూ, కౌన్సెలింగ్‌ అధికారుల పరస్పర ఆరోపణలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): టీఎస్‌ ఎంసెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో అధికారులు తప్పటడుగు వేశారు. దీంతో జేఎన్‌టీయూ, ఓయూ పరిధిలోని కాలేజీల్లో బీటెక్‌ బయో టెక్నాలజీ సీట్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లో బీటెక్‌ బయోటెక్నాలజీ సీట్లు 66 ఉండగా, ఎంపీసీ, బైపీసీ అభ్యర్థులకు చెరి సగం కేటాయించాల్సి ఉంది. ఆదివారం జరిగిన కౌన్సెలింగ్‌లో అన్ని సీట్లను కౌన్సెలింగ్‌ అధికారులు ఎంపీసీ అభ్యర్థులకే కేటాయించారు. దీనిపై పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు జేఎన్‌టీయూ ఉన్నతాధికారులను సంప్రదించారు. ఈ విషయం వైస్‌ చాన్స్‌లర్‌ కట్టా నర్సింహారెడ్డి దృష్టికి వెళ్లడంతో కౌన్సెలింగ్‌ అధికారులను వివరణ కోరాలని రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ను ఆదేశించారు. జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి బీటెక్‌లో బయోటెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, జియో ఇన్ఫర్మాటిక్స్‌ కోర్సులు ప్రవేశపెట్టారు. ఆయా కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కలిపి 66 చొప్పున సీట్లు ఉన్నాయి. బయో టెక్నాలజీ సీట్లను మాత్రం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు 50 శాతం చొప్పున కేటాయించాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శికి ఉత్తర్వులు పంపారు. కానీ కౌన్సెలింగ్‌ అధికారులు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ సూచనలను విస్మరించారు. దీంతో బైపీసీ కోటా సీట్లు కూడా ఎంపీసీ అభ్యర్థులతోనే భర్తీ అయ్యాయి. హైదరాబాద్‌లోని సీబీఐటీ కాలేజీలోని బయోటెక్‌ సీట్ల విషయంలోనూ ఇదే తరహా గందరగోళం ఏర్పడింది. జేఎన్‌టీయూ, కౌన్సెలింగ్‌ అధికారులు తప్పు తమది కాదంటే, తమది కాదని అంటున్నారు.

సమాచారంలో స్పష్టత లేకనే..

మొదటి విడతలో సీట్ల కేటాయింపుపై జేఎన్‌టీయూ అధికారులు, సీబీఐటీ యాజమాన్యం నుంచి స్పష్టమైన సమాచారం అందకపోవడమే ఈ గందరగోళానికి కారణమని కౌన్సెలింగ్‌ అధికారులు చెబుతున్నారు. మరోవైపు జేఎన్‌టీయూ వీసీ స్పందిస్తూ యూనివర్సిటీ నుంచి తప్పేమీ లేదని, కౌన్సెలింగ్‌ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ నుంచి ఉన్నత విద్యా మండలికి జూన్‌ 6న ఒక లేఖ, జూన్‌ 8న మరో లేఖ వెళ్లింది. రెండో లేఖను ప్రాతిపదికగా తీసుకొని కౌన్సెలింగ్‌ అధికారులు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మొదటి లేఖలో పేర్కొన్న చెరో 50 శాతం సీట్ల కేటాయింపు అంశాన్ని జేఎన్‌టీయూ అధికారులు రెండో లెటరులో పేర్కొనకపోవడమే ఈ గందరగోళానికి కారణమైందని అంటున్నారు. జేఎన్‌టీయూ అధికారులు పంపిన రెండు లేఖల్లో మొదటి దాన్ని ఉన్నత విద్యామండలి కార్యదర్శి... కౌన్సెలింగ్‌ అధికారులకు పంపకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఉన్నతాధికారుల మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌తో తమ పిల్లల భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-07-18T04:51:43+05:30 IST