Jupalli Krishnarao: కేసీఆర్‌కు మైనంపల్లి దెబ్బ రుచి.. పట్నం పౌరుషం చూపించాలి
ABN, First Publish Date - 2023-08-22T14:08:10+05:30
సీఎం కేసీఆర్ ఆఘమేఘాల మీద 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారని.. దాని వల్ల ప్రజలకు ఏంవ ఒరిగిందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) ఆఘమేఘాల మీద 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారని.. దాని వల్ల ప్రజలకు ఏం ఒరిగిందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Former Minister Jupalli Krishnarao) ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి నేతలంతా గతంలో పోటీ చేశారని... కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. గతంలో పోటీ చేసిన వారు ఎవరెవరు ఎలాంటి వారని యావత్ రాష్ట్రం చూసిందన్నారు. హరీష్ రావు గురించి మైనంపల్లి డబ్బా పెట్టె, స్లిప్పర్ చెప్పులు అన్నారని.. ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. కేటీఆర్ అదంతా అబద్ధం అన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmanth rao) తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా మాట్లాడారన్నారు. మైనంపల్లి దెబ్బ కేసీఆర్‌కు రుచి చూపించాలని.. ఆత్మగౌరవం, రోషం, పౌరుషం ఉండాలని వ్యాఖ్యలు చేశారు. పట్నం మహేందర్ రెడ్డికి (Patnam Mahender reddy) విజ్ఞప్తి చేస్తున్న పట్నం పౌరుషం చూపించాలన్నారు. కేసీఆర్‌కు దిమ్మ తిరగాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ వచ్చినప్పుడు గేట్లు తెరుచుకోవని.. అప్పుడు ఆత్మగౌరవం ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్లో, ఢిల్లీ ఏఐసీసీలో కూడా టికెట్ల కోసం కొట్టుకుంటామని.. తమకు ఆ ప్రజాస్వామ్యం ఉందన్నారు. కేసీఆర్ కుటుంబానికి, నెహ్రు కుటుంబానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కేసీఆర్ గజ్వెల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారంటే ఓటమిని అంగీకరించినట్టే అని ఆయన అన్నారు.
కారును గుద్దుడు గుద్దితే అప్పడం అవ్వాల్సిందే...
తెలంగాణలో అవినీతి, అరాచకం, భూకబ్జాలు పెట్రేగిపోతున్నాయన్నారు. అక్టోబర్ 16న తమ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామంటున్నారని.. మేనిఫెస్టో అంటే భగవద్గీత బైబిల్, ఖురాన్ అన్నారని.. మరి గత మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ముందు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి, భూ మాఫియాపై సీబీఐ విచారణ చేపించగలరా అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్నారని విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికల్లో తమరు పెట్టిన ఖర్చు ప్రపంచంలో ఎవరు పెట్టలేదని..తమరు ఇందులో ఆదర్శమా అంటూ ఎద్దేవా చేశారు. 26న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వస్తున్నారని.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఉంటుందని తెలిపారు. 9 సంవత్సరాల్లో లక్ష రుణమాఫీకి వడ్డీ లక్ష అయిందని...తమరు వడ్డీ మాత్రమే మాఫీ చేశారన్నారు. ‘‘మీరు ట్రైలర్ చూసారు. మీ 9 ఏళ్ళ సినిమా ఇప్పుడు ఎండ్ కావడానికి వచ్చింది. కారును గుద్దుడు గుద్దితే అప్పడం కావాలి. నేను కొల్లాపూర్ నుంచి పోటీ చేయడానికి అప్లికేషన్ పెట్టుకుంటున్న. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అవసరమే. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు కాంగ్రెస్ పూర్తి చేసింది’’ అని జూపల్లి కృష్ణారావు చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-08-22T14:08:10+05:30 IST