Telangana Pending Bills: తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదంపై సుప్రీంలో విచారణ వాయిదా
ABN, First Publish Date - 2023-04-10T16:10:39+05:30
తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
న్యూఢిల్లీ: తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisai) వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ (Telangana Governor) ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చుతూ తెలంగాణ సర్కార్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీంతో పిటిషన్‌ను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ధర్మాసం నిర్ణయించింది.
అయితే నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పెండింగ్ బిల్లులపై విచారణ జరుగనుండగా గవర్నర్ అనూహ్య రీతిలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పంపిన బిల్లుల్లో మూడు బిల్లులకు తమిళిసై ఆమోద ముద్ర వేశారు. అలాగే రెండు బిల్లులను వెనక్కి పంపగా.. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. మరో 3 బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టారు. అయితే తాము ఎన్నో రకాల ఉద్దేశాలు, లక్ష్యాలతో బిల్లులను ఆమోదించి పంపితే గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, బిల్లుల్లో స్పష్టత కొరవడిందని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడం లేదని, అందుకే పెండింగ్‌లో పెట్టాల్సి వస్తోందని రాజ్‌భవన్ వర్గాలు ఇన్నాళ్లూ చెప్పుకొచ్చాయి. గత సెప్టెంబరులో జరిగిన శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదించి, అదే నెల 13న గవర్నర్ తమిళిసైకి పంపించింది. వాటిలో జీఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించారు. తాజాగా ఈరోజు మరో మూడు బిల్లులకు ఆమోద ముద్ర వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకూ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవే...
1. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజు) (సవరణ) బిల్లు
2. తెలంగాణ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు
3. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (విశ్వాసం యొక్క వయస్సు నియంత్రణ) (సవరణ) బిల్లు
4. యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు
5. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు
6. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ (సవరణ) బిల్లు
7. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (స్థాపన మరియు నియంత్రణ) (సవరణ)
8. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు
9. తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు
10. తెలంగాణ మునిసిపాలిటీల నిబంధనల చట్ట (సవరణ) బిల్లు
Updated Date - 2023-04-10T16:10:39+05:30 IST