Rains Lash Telangana: గోదావరి మహోగ్రరూపం.. ప్రమాదపుటంచున కడెం.. తెలంగాణలో ప్రాజెక్టులకు వరద పోటు
ABN, First Publish Date - 2023-07-27T12:03:13+05:30
తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద ఉధృతితో అనేక ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కొన్ని ప్రాజెక్టుల్లో సామార్థ్యాన్ని మించి వరద నీరు ప్రవహిస్తోంది. అనేక ప్రాజెక్టులు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. భాగ్యనగరంలోని హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్‌ను దాటేయగా.. భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద ఉధృతితో అనేక ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కొన్ని ప్రాజెక్టుల్లో సామర్థ్యాన్ని మించి వరద నీరు ప్రవహిస్తోంది. అనేక ప్రాజెక్టులు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. భాగ్యనగరంలోని హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్‌ను దాటేయగా.. భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. అలాగే కడెం ప్రాజెక్ట్ కూడా ప్రమాదపుటంచున నిలిచింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అనేక ప్రాజెక్టుల్లోకి ఎక్కువ మొత్తంలో ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు ఎత్తివేయడంతో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్న పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ప్రాజెక్ట్‌ల వద్ద పరిస్థితి ఇదీ...
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సారగ్‌కు వరద పోటెత్తుతోంది. బంజారా, పికెట్ , కూకట్‌పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్‌లోకి వరద వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌కు 20,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. వరద పోటెత్తడంతో హుస్సెన్‌సాగర్‌లో నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటేసింది. హుస్సెన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.60 మీటర్లుగా కాగా.. ఫుల్‌ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లుగా కొనసాగుతోంది. దీంతో అధికారులు తూముల ద్వారా హుస్సేన్‌సాగర్ నుంచి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ ఔట్ ఫ్లో 6000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: భారీగా వరద ఉధృతితో భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. దాదాపు 50.40 అడుగులు దాటి ప్రవాహం కొనసాగుతోంది. 12,79,307 క్యూసెక్కుల మేర గోదావరి ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాదం హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్ అలర్ట్ జోన్‌లో ఉంది. భద్రాచలం నుంచి చర్ల వైపు ఏపీ ఒడిషా ప్రధాన రహదారి కూనవరంవైపు పలు చోట్ల రహదారులపై వరద నీరు పోటెత్తింది. తాలిపేరు ప్రాజెక్ట్, కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లా వ్యాప్తంగా 1035 చెరువులు నిండుకుండలా మారాయి. వరద పోటు అధికంగా ఉండటంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భద్రాచలం నుంచి కొత్తగూడెం ప్రధాన రహదారిపై పలు చోట్ల రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వరద నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని.. సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు.
నిర్మల్: పెద్ద ఎత్తన వరద నీరు వచ్చి చేరడంతో కడెం ప్రాజెక్ట్ ప్రమాదపుటంచున నిలిచింది. కెపాసిటికి మించి ఎగువ నుంచి వరద నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 3.5లక్షల క్యూసెక్కులు కాగా అంతకుమించి వరద వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 18 గేట్లలో నాలుగు వరద గేట్లు మొరాయిస్తున్న పరిస్థితి. మిగిలిన 14 గేట్లను ఎత్తి 2 లక్షల 19వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ గుండా వరద నీరు వెళ్లిపోతోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. గత ఏడాది పరిస్థితి పునరావృత్తమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు కడెం ప్రాజెక్టు ఉధృతి నేపథ్యంలో అధికారుల అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. పాండవపూర్ వంతెన వద్ద వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో నిర్మల్ - మంచిర్యాల రూట్లలో రాకపోకలు నిలిపివేశారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని ఎమ్మెల్యే రేఖా నాయక్, అధికారులు సమీక్షిస్తున్నారు. వరద ఉధృతి అధికంగా ఉండటంతో కడెం ప్రాజెక్టు చివరి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. లోతట్టులో ఉన్న 12 గ్రామాలను ముందస్తుగా ఖాళీ చేయించారు. కడెం ప్రాజెక్టు వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. పరిస్థితి సీరియస్ దృష్ట్యా ప్రాజెక్ట్ వద్దకు అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు.
కొమురం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 76వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తి వేసి 77వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 241.50 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 237.700మీటర్లుగా కొనసాగుతోంది.
మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకు వరద పోటు అధికంగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట 32 గేట్లు ఎత్తివేశారు. దాదాపు 3 లక్షల 48 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4 లక్షల 11 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 15.7817 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ నీటిని దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నిర్మల్: జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 13 వేల క్యూసెక్కులుగా ఉండటంతో అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తివేసి 13 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 1183అడుగులు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 1181 అడుగులకు చేరింది.
ఖమ్మం: జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు పూర్తి నీటి సామర్ధ్యం 25 అడుగులు కాగా.. ప్రస్తుతం 26 అడుగులకు వరద ప్రవాహం చేరుకుంది. దీంతో మున్నేరు ముంపు వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముంపునకు గురయ్యే మోతీనగర్, బొక్కల గడ్డ వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద మున్నేరు, ఆకేరు, బుగ్గేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలో పలు గ్రామాలతో పాటు డోర్నకల్లు మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు పరివాహక గ్రామాల ప్రజానీకం భయాందోళనలో ఉన్నారు. మున్నేరు ప్రవాహాన్ని కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ పరిశీలించారు. లోతు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే ఖాలీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతం నుంచి సుమారు 50 అడుగుల మేర ఎవరూ నివాసం ఉండవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
మహబూబ్‌నగర్: జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో: 48,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 55,856 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 9.234 టీఎంసీలుగా కొనసాగుతోంది. జూరాల ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 8 యూనిట్లలో 316 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా: మంథని మండలంలోని పార్వతి సుందిళ్ళ బ్యారేజిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో 54 గేట్లను ఎత్తివేశారు. దాదాపు లక్షా 74 వేల 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజి కెపాసిటీ 8.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్యారేజ్ ఇన్ ఫ్లో : 174400 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 174400 క్యూసెక్కులుగా ఉంది.
నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 17,650.00 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం : 645 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 642.10 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.71 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
కామారెడ్డి: జిల్లాలోని కౌలాస్ నాల ప్రాజెక్ట్‌కు 691 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 458 అడుగులు కాగా ప్రస్తుతం 457.45 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 1.237 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1.105 టీఎంసీల నిల్వ కొనసాగుతోంది.
నిజామాబాద్: భారీ వర్షాల కారణంగా ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ నిండిపోయింది. ప్రాజెక్ట్ నీటి మట్టం 1278.300 ఎఫ్‌టీ/ 1278.300 ఎఫ్‌టీ ఉండగా.. ప్రాజెక్ట్ కెపాసిటీ 0.9 టీఎంసీ / 0.9 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే ఇన్‌ఫ్లో, ఔట్ ప్లో 1,981 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.
కరీంనగర్: జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంలోకి నీటి ప్రహహం పెరుగుతోంది. లోయర్ మనేర్ డ్యామ్ నీటిమట్టం 14 టీఎంసీలకు చేరింది. మిడ్ మానేరు ద్వారా 1,700 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం ద్వారా 43,989 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 44,989 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో మొత్తం 263 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు కెపాసిటీ 14.634/24.034గా ఉంది.
సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 5246 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 385 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు 22.145 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
నిజామాబాద్: జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,16,293 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1087.30 అడుగులు, 74.186 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పెరుగుతున్న వరదతో గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-07-27T13:31:56+05:30 IST