Hyderabad City: వీకే బావ ఇక లేరు
ABN , First Publish Date - 2023-01-10T08:25:27+05:30 IST
హైదరాబాద్ చరిత్రకు చిరునామా, వారసత్వ కట్టడాల పరిరక్షణోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ చరిత్ర రచయిత..
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ చరిత్రకు చిరునామా, వారసత్వ కట్టడాల పరిరక్షణోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ చరిత్ర రచయిత.. వీకే బావగా అంతర్జాతీయ చరిత్ర పరిశోధకులకు సైతం సుపరిచితుడైన విశ్రాంత ఐఏఎస్ వసంత కుమార్ బావ (93) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. క్రైస్తవ మతారాధకుడైన వీకే బావ చివరి కోరిక మేరకు భౌతికకాయాన్ని ఆయన భార్య అవదేశ్‌రాణి.. గాంధీ వైద్య కళాశాలకు అందజేశారు. వీకే బావ స్వస్థలం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్. తన 60వ ఏట అవదేశ్ రాణి (ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రాజ్‌బహదూర్ గౌర్ సోదరి)ని ప్రేమించి పెళ్లాడారు.
1954, ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వీకే బావ ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ సంచాలకుడిగా, హైదరాబాద్ జిల్లా కలెక్టరుగా 1960లలో బాధ్యతలు నిర్వర్తించారు. విశాఖపట్నం పట్టణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్‌గా, హుడా వ్యవస్థాపక వైస్ చైర్మన్‌గా సేవలు అందించారు. 1979లో ఫోర్ట్ ఫౌండేషన్ ద్వారా నగరంలోని వారసత్వ కట్టడాలపై అధ్యయనం చేయించారు. తర్వాత అదే హుడా వారసత్వ కట్టడాల జాబితా రూపకల్పనకూ ఆధారమైంది. 1980లో పదవీ విరమణ అనంతరం పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్ట్టారికల్ రీసెర్చి సీనియర్ ఫెల్లోగానూ కొంతకాలం ఉన్నారు. హైదరాబాద్ చరిత్రపట్ల అవ్యాజమైన ప్రేమ కలిగిన ఆయన అనేక రచనలు చేశారు. వీకే బావ భౌతికకాయానికి విశ్రాంత ఐపీఎస్ అరుణ బహుగుణతోపాటు చరిత్రకారుడు సజ్జాద్ షాహిద్ తదితరులు నివాళులు అర్పించారు.