A. Santikumarini: తెలంగాణ ఆవిర్భవించాక మొదటి మహిళా సీఎస్
ABN , First Publish Date - 2023-01-12T03:37:37+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎవరన్న ఉత్కంఠకు సర్కారు తెరదించింది.

సీఎస్‌గా శాంతికుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ ఆవిర్భవించాక మొదటి మహిళా సీఎస్
రామకృష్ణారావు, శాంతికుమారితో కేసీఆర్ చర్చలు
సీనియారిటీ, సర్వీసు కాలం ఆధారంగా నియామకం
శాంతికుమారికి కేవలం ప్రధాన కార్యదర్శి బాధ్యతలే
రెరా కమిషనర్, ధరణి బాధ్యతలు రామకృష్ణారావుకు?
సోమేశ్‌కుమార్ పర్యవేక్షించిన వాణిజ్య పన్నులు,
ఎక్సైజ్ శాఖలు ఇతర ఐఏఎస్‌లకు అప్పగించే అవకాశం
రాష్ట్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా: శాంతికుమారి
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎవరన్న ఉత్కంఠకు సర్కారు తెరదించింది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎ.శాంతికుమారిని సీఎ్‌సగా ప్రభుత్వం నియమించింది. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖను పర్యవేక్షిస్తున్నారు. పలు తర్జనభర్జనల అనంతరం ఆమె నియామకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే చేశారు. సీఎం ఆదేశాలతో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం నియామక ఉత్తర్వులు (జీవో నంబర్ 71) జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఓ మహిళా ఐఏఎ్‌సను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సీఎ్‌సగా నియమితులైనఅనంతరం శాంతికుమారి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. తన నియామకం పట్ల దన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను అభినందించారు. ఇంతకుముందు తెలంగాణ సీఎ్‌సలుగా రాజీవ్‌శర్మ, ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్, ఎస్‌కే జోషి పని చేశారు. ఆ తర్వాత 2019లో నియమితులైన సోమేశ్‌కుమార్ మూడేళ్లకు పైగా సీఎ్‌సగా కొనసాగారు. ఐదో సీఎ్‌సగా శాంతికుమారి నియమితులయ్యారు. సోమేశ్‌కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేయడంతో కొత్త సీఎ్‌సను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సీఎ్‌సగా ఎవరిని నియమిస్తారన్న చర్చ మంగళవారం సాగింది. పలువురు సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. 1991కు బ్యాచ్‌కు చెందిన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌లలో ఒకరిని సీఎ్‌సగా నియమిస్తారన్న చర్చ జరిగింది. మధ్యలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్లు కూడా చర్చకు వచ్చాయి.
సర్వీసు కాలాన్ని పరిగణనలోకి తీసుకొని..
సీఎస్ నియామకం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఐఏఎ్‌సల సర్వీసు కాలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. పైగా తెలుగు వ్యక్తికి ప్రాధాన్యమివ్వాలని యోచించారు. సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేయగానే.. ప్రతిపక్షాల వాణి పెరగడం, సీనియర్ అధికారిని సీఎ్‌సగా నియమించాలనే డిమాండ్ రావడంతో.. సీనియర్లను పక్కన పెడితే మళ్లీ విమర్శలొస్తాయని కూడా సీఎం భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ క్యాడర్ సీనియారిటీలో నాలుగో స్థానంలో ఉన్న శాంతికుమారిని నియమించారు. వాస్తవానికి తెలంగాణ ఐఏఎ్‌సలలో అందరికంటే సీనియర్ అధికారి వసుధా మిశ్రా. 1987 బ్యాచ్‌కు చెందిన ఈమె ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో యూపీఎస్సీ సెక్రటరీగా కొనసాగుతున్నారు. 1988 బ్యాచ్‌కు చెందిన వై.శ్రీలక్ష్మి డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్నారు. ఇదే బ్యాచ్‌కు చెందిన మరో సీనియర్ అధికారిణి, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఈ సంవత్సరం జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. చాలా తక్కువ కాలంలోనే రిటైర్ అవుతున్నందున.. ఆమెను ప్రభుత్వం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శాంతికుమారి సర్వీసు 2025 ఏప్రిల్ వరకు ఉంది. ఆమె పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల మూడు నెలల కాలం మిగిలి ఉండడంతో.. ఎక్కువ కాలం పని చేసే అవకాశం ఉండడం, తెలుగు అధికారిణి కావడం, పోటీలో ఉన్న అధికారుల్లో సీనియర్ కావడంతో ఆమెను సీఎ్‌సగా నియమించారు. రామకృష్ణారావు 2025 ఆగస్టులో, అర్వింద్‌కుమార్ 2026 ఫిబ్రవరిలో రిటైర్ కానున్నా.. వీరిద్దరి కంటే శాంతికుమారి సీనియర్ కావడంతో ఆమె వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నిజానికి రామకృష్ణారావే సీఎస్ అవుతారని అందరూ భావించారు. అయితే రామకృష్ణారావు, శాంతికుమారి ఇద్దరినీ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఎన్నికలు సమీపిస్తుండడాన్ని వారికి వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావుకు సీఎం కొంత సర్దిచెప్పినట్లు తెలిసింది.
మహిళకు అవకాశం రావడం సంతోషంగా ఉంది: శాంతికుమారి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఓ మహిళా అధికారినైన తనను నియమించడం సంతోషంగా ఉందని శాంతికుమారి అన్నారు. సీఎ్‌సగా నియమితులైన అనంతరం ఆమె ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆమె బీఆర్కే భవన్‌కు వచ్చి పదవీ బాధ్యతలు చేపట్టారు. తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలు ఎంతో గొప్పగా నడుస్తున్నాయని, ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళతానని అన్నారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. తెలంగాణ సమాజానికి తన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
సీఎస్‌కు పలువురి అభినందనలు...
సీఎ్‌సగా పదవీ బాధ్యతలు చేపట్టిన శాంతికుమారిని ఆర్థిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్ బీఆర్కే భవన్‌లో కలిసి అభినందనలు తెలిపారు. తమిళనాడు మాజీ సీఎస్, జనసేనపార్టీ సలహాదారు, ప్రముఖ కాపు సమాజం నాయకుడు ఆర్.రామ్మోహన్‌రావు, బీఆర్‌ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, ఏపీ నాయకుడు పార్థసారథి సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి శాంతికుమారిని సీఎ్‌సగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతికుమారిని అభినందించారు. మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తం.. శాంతికుమారిని కలిసి అభినందనలు తెలిపారు. కాగా, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్, అటవీశాఖ అధికారులు బీఆర్కే భవన్‌లో శాంతికుమారిని కలిసి అభినందించారు.
అంచెలంచెలుగా ఎదిగిన శాంతికుమారి
కొత్త సీఎస్‌గా నియమితులైన శాంతికుమారి అంచెలంచెలగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన శాంతికుమారి 1965 ఏప్రిల్ 17న జన్మించారు. ఆమె విద్యాభ్యాసం ఎక్కువగా విశాఖపట్నంలో సాగింది. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. మూడు దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్యం, స్కిల్ డెవల్‌పమెంట్ వంటి రంగాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పని చేశారు. సీఎం కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె మెదక్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. 2005-06లో సర్వే అండ్ సెటిల్‌మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా, 2006-2010 మధ్య సెర్ప్ సీఈవోగా, 2011లో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా, 2011 నుంచి 2015 వరకు కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 2015 మే నుంచి 2019 మార్చి 31 వరకు సీఎంవోలో ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. అనంతరం ఆమెను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. 2020 జూలైలో రాష్ట్ర అడవులు, పర్యావణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, సీఎ్‌సగా నియమితులయ్యే వరకు కొనసాగారు. నిజాయితీ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.