Minister Harishrao: గవర్నర్ తీరు సబబేనా?... తమిళిసైపై మంత్రి హరీష్ ఆగ్రహం
ABN, First Publish Date - 2023-04-10T14:21:13+05:30
మూడు పెండింగ్ బిల్లులకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు.
హైదరాబాద్: మూడు పెండింగ్ బిల్లులకు గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ఆమోదం తెలుపడంపై మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) స్పందించారు. ఈ సందర్భంగా గవర్నర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం (Central Government) స్వాతంత్ర్య వ్యవస్థలను రాజకీయంగా వాడుకుంటోందన్నారు. అసెంబ్లీ (Telangana Assembly) పాస్ చేసిన బిల్లులను గవర్నర్ 7 నెలలుగా ఆపారని.. దీని వెనుక రాజకీయం ఏంటి అనేది అందరికి తెలుసని అన్నారు. కోర్టులకు వెళ్లి కేసులు వేస్తే తప్ప బిల్లులు పాస్ కానీ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సుప్రీం కోర్టులో కేసు వేస్తే ఈ రోజు రెండు ముడు బిల్లులు పాస్ చేశారన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేస్తోంది, రాష్ట్ర ప్రగతిని ఎంతగా అడ్డుకుంటుందో గమనించాలని అన్నారు. ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని, రాష్ట్రపతి పరిశీలనకు పంపారు.. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా అని మంత్రి ప్రశ్నించారు.
కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే, 7 నెలలు ఆపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపారన్నారు. తమ పిల్లలకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా అని నిలదీశారు. అన్ని యూనివర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో 1961 నుంచే ఉన్నదని గుర్తుచేశారు. గవర్నర్ తీరు సబబేనా?.. ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తే రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్ చర్యలను తెలంగాణ సమాజం అసహ్యించుంటుందన్నారు. రాష్ట్ర ప్రగతికి సహకరించడం మాని మోకాల్లడ్డం పెడుతున్నారని మండిపడ్డారు. సరైన సమయంలో కేంద్రానికి తెలంగాణ సమాజం గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. స్వతంత్ర సంస్థలను పని చేయనీయకుండా చేయడం సమంజసం కాదన్నారు. మూడు బిల్లులను ఆమోదించడం పట్ల గవర్నర్‌కు మంత్రి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - 2023-04-10T14:21:13+05:30 IST