Minister KTR: సుఖేష్ గురించి ఎప్పుడూ వినలేదు.. వాడెవడో తెలియదు.. కేటీఆర్ ట్వీట్
ABN, First Publish Date - 2023-07-14T15:44:00+05:30
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
హైదరాబాద్: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekar) చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నేరస్తుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయి. సుఖేష్ అనే వాడి గురించి నేనెప్పుడూ వినలేదు. వాడెవడో కూడా నాకు తెలియదు. సుఖేష్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటాను. సుకేష్ లాంటి నేరస్తుడు మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి’’ అంటూ మీడియాకు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ గవర్నర్‌కు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ...
కాగా.. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌కు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. ‘‘నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉంది. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశా. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశా. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నా’’ అంటూ గవర్నర్ తమిళసైకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు.
Updated Date - 2023-07-14T15:51:40+05:30 IST