Nirmala Sitharaman: అసెంబ్లీలో మాపై నిందలా?

ABN , First Publish Date - 2023-02-17T02:06:00+05:30 IST

‘మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాల్లో వాటి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపమంటే అప్పటికే మెడికల్‌ కాలేజీలు ఉన్న ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల పేర్లు పంపారు. అక్కడ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని, ఎక్కడైతే లేవో ఆ జిల్లాల పేర్లు ఇవ్వమని మళ్లీ కోరితే స్పందన లేదు.

Nirmala Sitharaman: అసెంబ్లీలో మాపై   నిందలా?

కేంద్రం కోరినా మెడికల్‌ కాలేజీల కోసం ప్రతిపాదనలే పంపలేదు

గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు రూ.1.39 లక్షల కోట్లు ఇచ్చాం

రాష్ట్ర అప్పు 60 వేల కోట్ల నుంచి 3 లక్షల కోట్లకు ఎలా చేరింది?

‘5 ట్రిలియన్‌ డాలర్ల’ లక్ష్యాన్ని కేసీఆర్‌ జోక్‌ అనడం ప్రజలను వెక్కిరించినట్టే

కేసీఆర్‌పై నిర్మలా సీతారామన్‌ ధ్వజం

‘డీడీ డైలాగ్‌’లో కేంద్ర ఆర్థిక మంత్రి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ‘మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాల్లో వాటి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపమంటే అప్పటికే మెడికల్‌ కాలేజీలు ఉన్న ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల పేర్లు పంపారు. అక్కడ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని, ఎక్కడైతే లేవో ఆ జిల్లాల పేర్లు ఇవ్వమని మళ్లీ కోరితే స్పందన లేదు. ఇప్పుడేమో 157 మెడికల్‌ కాలేజీల్లో ఒక్కటీ తెలంగాణకు ఇవ్వలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది’ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఎన్డీఏ అంటే ‘నో డేటా గవర్నమెంట్‌’ అంటున్నారని, మీకు మీ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఉన్నాయన్న డేటానే లేనప్పుడు అసెంబ్లీలో నిలబడి మాపై నిందలు వేస్తే ఎలా? హోంవర్క్‌ చేసుకుని నిజం మాట్లాడితే బాగుంటుంద’ని బీఆర్‌ఎస్‌ సర్కారుకు సూచించారు. డీడీ డైలాగ్‌ పేరుతో దూరదర్శన్‌ ఆధ్వర్యంలో గురువారం హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన అమృతకాల బడ్జెట్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సభికులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకు 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయని, అక్కడే నర్సింగ్‌ కాలేజీలూ ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్‌లో చెప్పామని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రానికి రూ.1.30 లక్షల కోట్లు వచ్చాయన్నారు. 2021-22లో రూ.17,165 కోట్లు, 2022-23లో రూ.19,668 కోట్లు, 2023-24లో రూ.21,470 కోట్లు ఇచ్చామన్నారు.

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లో భాగంగా రాష్ట్రానికి రూ.1.39 లక్షల కోట్లు ఇచ్చామని, రైల్వే ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో రూ.4,418 కోట్లు కేటాయించామన్నారు. ‘ఈసారి బడ్జెట్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను హైదరాబాద్‌కే ఇస్తామని ప్రకటించాం. ఆర్కియాలజీ సర్వే కేంద్రం ఇక్కడేఏర్పాటు చేయబోతున్నాం. కొత్తగా ప్రకటించిన నేషనల్‌ డేటా గవర్నెన్స్‌ పాలసీ... డేటా కేంద్రంగా ఉన్న తెలంగాణకు లబ్ధి కలిగించే పాలసీ. దేశవ్యాప్తంగా 51 ఫార్మా రంగం పథకాలు ఉంటే అందులో 15తెలంగాణలో ఉన్నాయ’ని చెప్పారు. కేంద్రంపై ఆరోపణలు చేసేముందు కొంచెం లెక్కలు చూసుకోవాలని సూచించారు.

ఉపాధి హామీకి ఎక్కువే ఇస్తున్నాం

బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించారన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నను ప్రస్తావించగా నిర్మల స్పందిస్తూ ఈ పథకం డిమాండ్‌ ఆధారంగా అమలు చేసేదని, డిమాండ్‌ను బట్టే పనులు మంజూరు చేస్తామన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు బడ్జెట్‌లో చెప్పినదానికంటే ఎక్కువగానే ఖర్చు చేస్తున్నామన్నారు.

రాష్ట్రాల అప్పులను సమీక్షిస్తాం

రాష్ట్రాల రుణ సేకరణపై కేంద్రం పరిమితులు విధిస్తోందన్న ఆరోపణపై నిర్మల స్పందిస్తూ అప్పులపై పరిమితులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా రూపొందించామన్నారు. అప్పులపై కేంద్రం సమీక్ష 70 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయమని, 2014లో తాము కొత్తగా ప్రారంభించింది కాదన్నారు. బడ్జెట్‌లో మైనారిటీలకు తక్కువ కేటాయింపులపై స్పందిస్తూ మైనారిటీ శాఖ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలనే ఆమోదించామని, తాము తగ్గించలేదన్నారు. గత పన్ను విధానంతో పోలిస్తే కొత్త పన్ను విధానం సులభంగా ఉండేలా రూపొందించామన్నారు. కేంద్రం వసూలు చేస్తున్న సుంకాల కన్నా అధిక వాటా రాష్ట్రాలకు ఇస్తున్నామని చెప్పారు. వృద్ధి పెంపు, ఇంధన ధరల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా 2023-24 బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు.

‘5 ట్రిలియన్‌’ లక్ష్యాన్ని జోక్‌ అంటారా?

‘కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్‌ అంటున్నారు. ఇది ప్రధాని కోసమో, నా కోసమో పెట్టుకున్న లక్ష్యం కాదు. దేశం కోసం. అందరూ బాగుపడాలన్నదే లక్ష్యం. దీని కోసం అన్ని రాష్ట్రాలు సహకారం అందిస్తామని చెబుతుంటే ఇక్కడి ముఖ్యమంత్రి మాత్రం జోక్‌ అంటున్నారు. ఇది జనానికి అమర్యాద కాదా?’అని నిర్మల ప్రశ్నించారు. 2014 వరకు రూ.60 వేల కోట్ల అప్పు ఉంటే గత ఎనిమిదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3లక్షలకోట్లు దాటిపోయాయని చెప్పారు. ఈ అప్పుల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం గురించి జోక్‌ చేయవద్దని చేతులు జోడించి సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీని గురించి బాధ్యతగా మాట్లాడితే బాగుంటుందని సూచించారు.

Updated Date - 2023-02-17T03:17:21+05:30 IST