Revanth Reddy: అలా చేస్తే.. ఉరి తీసే విధానం రావాలి
ABN, First Publish Date - 2023-01-26T11:39:03+05:30
హత్యలు, హత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలి. పార్టీ ఫిరాయింపుల పట్ల కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై రాజ్యాంగంలో
హైదరాబాద్: ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వం రద్దు చేయడంతో పాటు అవసరమైతే ఉరి తీసే విధానాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘హత్యలు, హత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలి. పార్టీ ఫిరాయింపుల పట్ల కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన విషయాన్ని మేధావులు ఆలోచించాలి. రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు ప్రగతి భవన్‌కు, రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం ద్వారా కేసీఆర్ (kcr) రాజ్యాంగాన్ని అవమానించారు. గవర్నర్, సీఎం మధ్య విభేదాలు ఉంటే మరో వేదికపై ప్రదర్శించాలి. ఇద్దరి మధ్య విభేదాలకు గణతంత్ర దినోత్సవాన్ని వేదికగా మార్చుకోవడం మంచిది కాదు. కేసీఆర్ వ్యవహార శైలిని మార్చుకోవాలి. వెంటనే సీఎం కేసీఆర్.. గవర్నర్ (Tamilisai Soundararajan)కు క్షమాపణ చెప్పాలి. కోర్టు జోక్యం చేసుకుని రిపబ్లిక్ డే (Republic Day)వేడుకలు జరపాలని ఆదేశించే పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ విగ్రహం (Ambedkar statue) కోసం కోట్లు ఖర్చు పెట్టినా ఇంతవరకు పూర్తి చేయలేదు.’’ అని విమర్శించారు.
‘‘జనవరి 30న రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కశ్మీర్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి దేశ సార్వభౌమత్వాన్ని చాటుతారు. ఆ రోజు అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయాలి. ఇవాళ హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభించినా.. ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు కొనసాగుతుంది. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు తిరుగుతా. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలి. రిజర్వేషన్లను పేదలకు దూరం చేసే కుట్ర జరుగుతోంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. తొమ్మిది ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.’’ అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
Updated Date - 2023-01-26T11:45:35+05:30 IST