Rakesh master: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని వదిలేశాడు..
ABN , First Publish Date - 2023-01-11T09:07:10+05:30 IST
మహిళల విషయంలో అసభ్యంగా మాట్లాడటంతోపాటు సహజీవనం చేసి 22 ఏళ్ల క్రితం వదిలేసిన

హైదరాబాద్/బంజారాహిల్స్: మహిళల విషయంలో అసభ్యంగా మాట్లాడటంతోపాటు సహజీవనం చేసి 22 ఏళ్ల క్రితం వదిలేసిన మహిళను వేధిస్తున్న సినీ డ్యాన్స్ మాస్టర్ రాకేష్‌పై చర్యలు తీసుకోవాలని టీఎంపీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేష్‌మాదిగ డిమాండ్ చేశారు. బాధితులు చింతా కస్తూరి, లక్ష్మి, శాన్వి మీడియా యూట్యూబర్ చరణ్ గురువనిలతో కలిసి మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతా కస్తూరి మాట్లాడుతూ 22 ఏళ్ల క్రితం రాకేష్ మాస్టర్ తనను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని మోసం చేసి వదిలేశాడని ఆరోపించారు. దళిత మహిళ అయిన తనపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని ఇదే విషయమై గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు.
రాకేష్ మాస్టర్ నుంచి విడిపోయిన మరో మహిళ లక్ష్మిని కూడా ఇదే విధంగా వేధిస్తున్నారని అన్నారు. ఈ మహిళలు ఇద్దరికీ ఉపాధి కల్పించినందుకు యూట్యూబర్ చరణ్ గురువనిని కూడా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి రాకేష్ మాస్టర్‌పై ఫిర్యాదు చేస్తామని వెంకటేష్ మాదిగ అన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనా రాకేష్ మాస్టర్ తీరు మార్చుకోవడం లేదని ఆరోపించారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.