Revanth Reddy: వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారు... ఎవరెవరంటే..
ABN, First Publish Date - 2023-05-18T17:04:36+05:30
వివేక్ (Vivek), ఈటల (Etala), విశ్వేశ్వర రెడ్డి (Visveswara Reddy) లాంటి వాళ్ళు కాంగ్రెస్ (Congress)లోకి రావాలని ఆహ్వానిస్తున్నమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
హైదరాబాద్: వివేక్ (Vivek), ఈటల (Etala), విశ్వేశ్వర రెడ్డి (Visveswara Reddy) లాంటి వాళ్ళు కాంగ్రెస్ (Congress)లోకి రావాలని ఆహ్వానిస్తున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ సందర్బంగా గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. వివేక్, ఈటల, కొండా లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, బీజేపీ సిద్దాంతంతో సంబంధంలేనివాళ్ళు కొందరు బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరారన్నారు. సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్‌లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే... ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు.
కర్ణాటక ఫలితాలపై బండి సంజయ్, కేసీఆర్ ఒకేలాగా మాట్లాడుతున్నారని, బండి సంజయ్ మాటలను సీఎం సమర్ధించినట్టే ఈరోజు కర్ణాటక, రేపు తెలంగాణ, తర్వాత దేశమంతా కాంగ్రెస్ వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బ్రతికింది కాంగ్రెస్ పార్టీ వల్లేనన్నారు. సీఎం కేసీఆర్‌కు ఓటమి అర్థమై తప్పించుకోవడానికి ఎమ్మెల్యేలపై నెపం వేస్తున్నారని విమర్శించారు. ప్రజా సొమ్ముతో వేరే రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తారా? అని ప్రశ్నించారు. త్వరలోనే బీసీ పాలసీ ప్రకటిస్తామన్నారు. బీసీ గర్జన నిర్వహించాలని పార్టీ ఆదేశించిందని, బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ కమండల ఉద్యమం చేసిందన్నారు. మోదీని ప్రధాని చేస్తే బీసీల కడుపు నిండదన్నారు. పదవి పోయే ముందు బీజేపీకి బీసీలు గుర్తుకొస్తున్నారా? అని ప్రశ్నించారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. మోదీని ఓడించడానికి కాంగ్రెస్ నాయకత్వం అవసరమని దేశంలోని అన్ని పార్టీలు అనుకుంటున్నాయన్నారు.
కర్ణాటకలో చక్రం తిప్పాలని చూసిన కేసీఆర్ నడుములు విరగొట్టారని, కేసీఆర్, మోదీ వేరు వేరు కాదని రేవంత్ అన్నారు. జేడీఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ ప్రయత్నించారని, కర్ణాటకలో బీజేపీ చేసిందే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తోందన్నారు. కర్ణాటక ఫలితాలను దేశవ్యాప్తంగా చర్చిస్తున్నారని, ఇక మోదీ బ్రాండ్‌కు కాలం చెల్లిందన్నారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు నిలబడ్డారని కొనియాడారు. కర్ణాటక ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెట్టిందని, మోదీ కుట్రలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష సంబంధం లేనివాళ్ళు కూడా కర్ణాటక ప్రజలను అభినందించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-05-18T18:19:59+05:30 IST