Revanth Reddy: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2వేల మంది విద్యార్థులు మరణించారు..
ABN, First Publish Date - 2023-03-31T15:29:55+05:30
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) దొంగలు, దోపిడీ దారులకు అడ్డాగా మారిందని, అనర్హులను సభ్యులుగా నియమించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) దొంగలు, దోపిడీ దారులకు అడ్డాగా మారిందని, అనర్హులను సభ్యులుగా నియమించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (Paper Leakage) వ్యవహారంపై కాంగ్రెస్ (Congress) బృందం ఈడీ (ED)కి ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ఘటనపై ప్రభుత్వం కోర్టులో విచారణ ఎదుర్కుంటోందన్నారు. పరీక్ష పత్రాలను అమ్ముకుంటుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని. ప్రభుత్వ పెద్దలను అమర వీరుల స్తూపం వద్ద ఉరి తీసినా తప్పు లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2వేల మంది విద్యార్థులు మరణించారన్నారు.
విద్యార్థులు (Students) చనిపోతున్న కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, ఆధారాలు బయట పెడితే తిరిగి మామీదే కేసులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శంకర్ లక్ష్మి (Shankar Lakshmi) నుంచి నేరం మొదలైతే ఆమెను సాక్షిగా పెట్టారని.. ప్రభుత్వ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని.. దాన్ని కప్పి పెట్టడానికే సిట్ (SIT)ను నియమించారని విమర్శించారు. కావల్సిన వారిని కాపాడి దిగువ స్థాయి ఉద్యోగులను బలి పశువులు చేస్తున్నారన్నారు. ఈ కేసులో కోట్ల రూపాయల లావాదేవీలు నగదు రూపంలో జరిగాయని, ఇందులో విదేశాల్లో ఉన్నవారితో హవాలా రూపంలో నగదు చేతులు మారాయని ఆరోపించారు. సిట్ కొద్దిమందిని విచారించి కొందరిని వదిలేస్తోందని, అందరినీ విచారించాలని ఈడీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో మంత్రి కేటీఆర్ (Minister KTR) చెప్పారని.. రహస్య సమాచారం ఆయనకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అధికారులు ఇవ్వలేదనీ చెబుతున్నారు.. మరి దొంగలు ఇచ్చారా? ఆ దొంగలకు కేటీఆర్‌కు సంబంధం ఏంటి? అని నిలదీశారు.
విచారణను మంత్రి కేటీఆర్ నియంత్రిస్తున్నారని, మంత్రి చెప్పిందే సిట్ అధికారులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనిపై విచారణ జరపాలని ఈడీని కోరామన్నారు. అసలు మంత్రి కేటీఆర్‌కు పరువు ఉందా? అని ప్రశ్నించారు. దమ్ముంటే కేసును సిబిఐ, ఈడీకి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తారని జయలలిత, సుబ్రమణ్య స్వామి కేసులో కోర్టు చెప్పిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-03-31T15:29:55+05:30 IST