TS News: నార్మల్ డెలివరీ అవుతుందంటూ ఆపరేషన్ చేయని వైద్యులు.. చివరకు
ABN, First Publish Date - 2023-04-22T11:04:51+05:30
ఆ గర్భిణీ పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలకన్నది. తొమ్మిది నెలల పాటు బిడ్డను కడపులో మోసింది.
సంగారెడ్డి: ఆ గర్భిణీ పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలుకన్నది. తొమ్మిది నెలల పాటు బిడ్డను కడుపులో మోసింది. డెలివరీ సమయం దగ్గరకు వచ్చేయడంతో సంతోషపడింది. పురిటినొప్పులతో ఆస్పత్రికి చేరగా.. అక్కడి వైద్యులు నార్మల్ అవుతుందని చెప్పారు. పురిటినొప్పులను భరిస్తూనే బిడ్డ రాకకోసం ఎదురు చూసింది. అంతలోనే అనుకోని విషాదం ఆమెను చుట్టుముట్టింది.
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పురిటినొప్పులతో వచ్చిన గర్భిణికి డెలివరీ చేయడంలో వైద్యులు జాప్యం చేయడంతో శిశువు మృతి చెందింది. కొద్ది గంటల్లోనే తల్లి కూడా మృతి చెందింది. రేణుక అనే గర్భిణి ఈ నెల 20న పురిటినొప్పులతో డెలివరీ కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని ఆపరేషన్ చేయమని తెలిపారు. అయితే 24 గంటలు గడిచినప్పటికీ రేణుకకు నార్మల్ డెలివరీ అవ్వలేదు. చివరకు రేణుక పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆపరేష్‌న్ చేసి శిశువుని బయటకు తీశారు. అయితే అప్పటికే మగ శిశువు మృతి చెందింది. రేణుక పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూ చికిత్స అందజేశారు. అయితే రేణుక పరిస్థితి మరింత విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. తల్లి, బిడ్డ ఇద్దరు మృతి చెందడంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తల్లి, బిడ్డ చనిపోయారని బంధువులు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
Updated Date - 2023-04-22T11:39:55+05:30 IST