ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR MODI: కేసీఆర్‌ను మీరేమైనా మహారాజా అని ప్రశ్నించా? ఆ తర్వాత రియాక్షన్ చూసి..!

ABN, First Publish Date - 2023-10-04T03:25:32+05:30

ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం ఇవాళ మీకు చెబుతున్నా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి నన్ను కలిశారు.

  • ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ను ఆశీర్వదించాలన్నారు

  • ఆయనకు బాధ్యత ఇవ్వాలనుకుంటున్నానని కేసీఆర్‌ చెప్పారు

  • ఇది ప్రజాస్వామ్యం.. రాచరికం కాదని స్పష్టం చేశా

  • యువరాజును సీఎం చేయడానికి మీరు మహారాజా అని ప్రశ్నించా

  • అంతకుముందు భారీ శాలువాలతో వచ్చి నాపై ప్రేమ ఒలకబోశారు

  • నా పాలన ప్రగతిపథంలో దూసుకెళ్తోందని పొగడ్తలతో ముంచెత్తారు

  • ఎన్డీయేలో బీఆర్‌ఎస్‌ను భాగస్వామిని చేసుకోవాలని కోరారు

  • జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అడిగారు

  • మీతో జత కట్టే ప్రసక్తే లేదన్నా.. ఎన్డీయేలోనూ చేర్చుకోబోమని చెప్పా

  • అప్పటి నుంచే కేసీఆర్‌ వైఖరిలో అనూహ్య మార్పు వచ్చింది

  • ఇక్కడ లూటీ చేసిన సొమ్మును కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఇచ్చారు

  • ఇందూరు సభలో సంచలన విషయాలను బయటపెట్టిన మోదీ

  • అవినీతిపరులు తన పక్కన కూర్చోవడానికే భయపడతారని,

  • అందుకే కేసీఆర్‌ పారిపోతున్నారని వ్యాఖ్య

  • అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్‌ పాపాల చిట్టా తీస్తామని హెచ్చరిక

  • 8 వేల కోట్లతో వివిధ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

హైదరాబాద్‌, నిజామాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం ఇవాళ మీకు చెబుతున్నా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్‌ (CM kcr) ఢిల్లీ వచ్చి నన్ను కలిశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. తాము ఎన్డీయేలో చేరతామని ప్రతిపాదించారు. వాటిని నేను నిర్ద్వంద్వంగా తిరస్కరించాను’’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో మంగళవారం ఎన్టీపీసీ, రైల్వే, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలను ప్రారంభించిన తర్వాత నిర్వహించిన జనగర్జన సభలో ఆయన మాట్లాడారు. తన పంథాను వీడి తొలిసారిగా సీఎం కేసీఆర్‌పై నేరుగా విమర్శల దాడి చేశారు. తమ మధ్య జరిగిన రహస్య చర్చలను సభాముఖంగా బయటపెట్టారు. ‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ నన్ను కలవడానికి వచ్చారు. పెద్ద పెద్ద శాలువాలు తెచ్చారు. ఆయన వ్యక్తిత్వానికి భిన్నంగా ఎంతో ప్రేమ ఒలకబోశారు. నా హయాంలో దేశం ప్రగతి పథంలో సాగుతోందని పొగడ్తలతో ముంచెత్తారు. తాను కూడా ఎన్డీయేలో చేరతానని చెప్పారు. తమను భాగస్వామిని చేసుకోవాలని కోరారు. ఇంతకీ కారణమేమంటే.. జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో బీజేపీ మద్దతు కోసం. దాంతో, మీతో జత కట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశా. విపక్షంలో కూర్చోవాల్సి వస్తే కూర్చుంటాం. (కేసీఆర్‌ ప్రభుత్వం) మా కార్యకర్తలపై జులుం చేసినా భరిస్తాం. కానీ, తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 స్థానాలు కట్టబెట్టారు. ఇది తెలంగాణాలో రాజకీయ మార్పునకు శుభారంభం. ఎన్డీయేలో కేసీఆర్‌ ఎంట్రీకి నేను ఒప్పుకోలేదు. ఆయన అవినీతిపై ప్రశ్నించా. దాంతో, ఆయన వైఖరిలో అనూహ్య మార్పు వచ్చింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఢిల్లీ వచ్చారు. మోదీ జీ..! తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డా. ఇక కేటీఆర్‌కు బాధ్యత ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన్ను మీ వద్దకు పంపిస్తాను. ఆశీర్వదించాలని కోరారు. ‘కేసీఆర్‌..! ఇది ప్రజాస్వామ్యం.. రాజరికం కాదు. యువరాజును సీఎం చేయడానికి మీరేమైనా మహారాజా?’ అని ప్రశ్నించా. ఎవరిని కూర్చోబెట్టాలో.. ఎవరిని కూర్చోబెట్టవద్దో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని స్పష్టం చేశా. బస్‌..! అదే ఆఖరి రోజు.. ఆ తర్వాత నుంచి కేసీఆర్‌ ఒక్కసారి కూడా నన్ను కలుసుకోలేదు. నా కళ్లలోకి చూసే ఽధైర్యం కూడా ఆయనకు లేదు. అవినీతికి పాల్పడ్డవారు నా పక్కన కూర్చునేందుకు భయపడతారు. అందుకే కేసీఆర్‌ పారిపోతున్నారు’’ అని వెల్లడించారు. అవసరం తీరాక కేసీఆర్‌ ప్రవర్తన మారిందని, హైదరాబాద్‌ ఎన్నికలప్పుడు తనతో సన్నిహితంగా ఉంటూ స్వాగతం పలికారని, మరి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. తనను అభినందించడానికి వేలాది మంది తరలి వచ్చారని, ఇంతకంటే ఏం కావాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పథకాల పేరుతో జరుగుతున్న లూటీని తన కళ్లతో చూస్తున్నానని, ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌ పాపాల చిట్టాను తెరుస్తామని ప్రకటించారు.

ఇక్కడ లూటీ.. కర్ణాటకలో ఖర్చు

‘‘తెలంగాణకు.. రాష్ట్ర అభివృద్ధికి ఎంత చేయాలో అంత చే స్తున్నాం. జాతీయ రహదారులు, ఆస్పత్రులు, రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తుంటే వాటిని బీఆర్‌ఎస్‌ లూటీ చేస్తోంది. తెలంగాణలో లూటీ చేసిన సొమ్మును కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్‌ ఖర్చు చేసింది’’ అని మోదీ ఆరోపించారు. ఇక్కడ దోచుకున్న సంపదను బీఆర్‌ఎస్‌ కర్ణాటకకు పంపించి కాంగ్రె్‌సను గెలిపించిందని విమర్శించారు. తెలంగాణ కోసం వేలాదిమంది బలిదానం చేశారని, రాష్ట్రం ఏర్పడిన ఫలితాన్ని ఓ కుటుంబం అనుభవిస్తోందని, రాష్ట్ర ప్రజల సంపదను ఆ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారని, ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చారని ధ్వజమెత్తారు. కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. హామీలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలది ఒకటే బాట అని ప్రధాని మోదీ ఆరోపించారు. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని బుట్టదాఖలు చేయడం వాటి నైజమని మండిపడ్డారు. ఎన్నికల ముందు అరకొర లబ్ధి చేకూర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లు లూటీ చేస్తారని హెచ్చరించారు. ‘‘తెలంగాణలో ఈ లూటీని అడ్డుకుందాం. మాపై కేవలం ఐదేళ్లు భరోసా ఉంచండి చాలు. ఎక్కువేం వద్దు.. ఎంత దోపిడీ చేశారో మీ ముందు ఉంచుతాం’’ అని మోదీ పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఎన్నో హామీలు ఇస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుకు షరతులు విధిస్తుంది. బీఆర్‌ఎస్‌ కూడా నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసింది. కానీ, ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయడం బీజేపీ ట్రాక్‌ రికార్డు’’ అని మోదీ స్పష్టం చేశారు.

యువతకు నాదీ గ్యారంటీ

గడచిన కొద్ది నెలలుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా లక్షలాది యువతకు నియామక పత్రాలు అందజేశామని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘యువత నిరుత్సాహపడవద్దు. మీకు నాది గ్యారంటీ. నాకు సేవ చేసే అవకాశం ఇస్తారా? మీ ఇబ్బందులు తొలగించే అవకాశం ఇస్తారా? బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి. నిజాయితీగా పని చేస్తాం. రెట్టింపు వేగంతో అభివృద్ధి చేస్తాం. లూటీ బంద్‌ చేస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు. ఒక గుజరాతీ బిడ్డ (సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌) నిజాం నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించారని, ఇప్పుడు మరో గుజరాతీ బిడ్డగా తాను తెలంగాణ పురోభివృద్ధికి కృషి చేస్తున్నానని మోదీ వ్యాఖ్యానించారు. నిజాం నవాబు ఆనాడు హైదరాబాద్‌ను వదలకపోతే పటేల్‌ వచ్చి తరిమేశారని, ఇప్పుడు రాష్ట్రంలో అరాచక పాలన అంతం చేయడానికి తాను వచ్చానన్నారు. కరోనాతో ప్రపంచదేశాలు అతలాకుతలమైన సమయంలో వ్యాక్సిన్‌ అందించి తెలంగాణ తన ఘనతను చాటుకుందని, దేశ ప్రగతిలో తెలంగాణ భాగస్వామ్యం ఉందని మోదీ చెప్పారు.

జనాభా దామాషాతో దక్షిణాదికి నష్టం

కాంగ్రెస్‌ పెద్ద ఖిలాడీ అని, ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ప్రధాని మోదీ హెచ్చరించారు. ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోతే మళ్లీ దక్కించుకోవడం కాంగ్రె్‌సకు కష్టమని, అందుకే, గెలిచేందుకు అమలు సాధ్యం కాని హామీలు ఇస్తోందని విమర్శించారు. ‘‘పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జనాభా దామాషా ప్రకారం జరగాలంటున్న కాంగ్రెస్‌ వైఖరితో దక్షిణాదికి నష్టం కలుగుతుంది. ఎంత జనాభా ఉంటే అంత హక్కు అంటూ కాంగ్రెస్‌ కొత్త నాటకానికి తెరదీసింది. జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సంపూర్ణంగా అమలు చేశాయి. దాంతో, ఇక్కడ సీట్లు తగ్గే అవకాశం ఉంది. దీనికి కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి’’ అని నిలదీశారు. అలాగే, మైనారిటీలకు కూడా అంతే హక్కు ఉండాలా? ఇలాంటి కాంగ్రెస్‌ వైఖరిని క్షమిస్తారా? అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ఆటను ఎందుకు ఆడుతోందో కాంగ్రెస్‌ స్పష్టం చేయాలని నిలదీశారు. ఇండియా కూటమి పక్షాలకు ధైర్యముంటే ఆ పార్టీని ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడులో ప్రభుత్వం కబ్జా చేసుకున్న హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులను తిరిగి వారికి అప్పగిస్తారా? అని కాంగ్రెస్‌, ఇండియా కూటమిని మోదీ నిలదీశారు. ఆలయాల ఆస్తులను కబ్జా చేస్తున్న ప్రభుత్వాలు మైనారిటీ ప్రార్థన మందిరాల ఆస్తుల జోలికి వెళ్లడం లేదని విమర్శించారు. కొన్ని పార్టీలు మహిళా బిల్లును 30 ఏళ్లుగా అడ్డుకున్నాయని, ఇప్పుడు తప్పనిసరై పార్లమెంటులో బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్‌, ఇండియా కూటమిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రూ.8 వేల కోట్ల పథకాలకు ప్రారంభం

నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్టేజీ నుంచి రూ.8,021 కోట్లతో చేపట్టిన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ధర్మాబాద్‌- మనోహరాబాద్‌-కర్నూలు రైల్వే లైను విద్యుద్దీకరణ; మనోహరాబాద్‌-సిద్దిపేట రైల్వే లైన్‌ను ప్రారంభించారు. సిద్దిపేట-సికింద్రాబాద్‌ రైలు సర్వీసును ప్రారంభించారు. 20 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లకు శంకుస్థాపన చేశారు. విద్యుత్‌ ప్లాంటు, రైల్వే లైన్‌ ప్రారంభోత్సవాలను ఉదాహరించిన ఆయన.. శంకుస్థాపన చేసిన తానే ప్రారంభోత్సవం చేస్తున్నానని, బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీలకు ఇదే నిదర్శనమని అన్నారు. ఈ పనులు తమ వర్క్‌ కల్చర్‌కు నిదర్శనమని అన్నారు.

సభకు భారీగా పసుపు రైతులు

పసుపు బోర్డు ప్రకటించిన రెండు రోజుల తర్వాత నిజామాబాద్‌ చేరుకున్న ప్రధాని మోదీకి మహిళలు ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి పనుల వేదిక నుంచి బహిరంగ సభా వేదిక వరకు మహిళలు పూల వర్షం కురిపించి.. ఘన స్వాగతం పలికారు. ప్రజా గర్జనకు పసుపు రైతులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు ప్రధానికి గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ తదితరులు స్వాగతం పలికారు.

మనోహర్‌రెడ్డి గురించి ఆరా తీసిన ప్రధాని

పసుపు బోర్డు ఏర్పాటు కోసం పుష్కరకాలం పాటు చెప్పులు లేకుండా తిరిగిన పసుపు బోర్డు ఉద్యమ నాయకుడు మనోహర్‌రెడ్డి గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు. చెప్పులు లేకుండా తిరిగిన ఆ కార్యకర్త పేరు ఏమిటని బండి సంజయ్‌ను ఆరా తీశారు. మనోహర్‌ రెడ్డి అనే రైతు 2011 నవంబరు 4 నుంచి పసుపు బోర్డు కోసం చెప్పులు లేకుండా తిరుగుతున్నట్లు ప్రధానికి తెలిపారు. మనోహర్‌ రెడ్డి లక్ష్యం నెరవేరినందున తన తరఫున అభినందనలు తెలుపాలని మోదీతెలిపారు. అనంతరం మనోహర్‌రెడ్డిని బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావుఘనంగా సన్మానించారు. సభలో భరతమాత వేషధారణలో ఉన్న ఓ చిన్నారిని మోదీ అభినందించారు. ఆమెను చూస్తుంటే సంతోషంగా ఉందంటూ ‘శభాష్‌ బేటా’ అని ప్రశంసించారు.

ఇదీ మా పని విధానం..

‘నా కుటుంబ సభ్యులారా..’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ.. రైల్వే, విద్యుత్తు, వైద్య రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా వాటిని పూర్తి చేసి చూపిస్తున్నామని, ఇది తమ కొత్త పని విధాన (న్యూ వర్క్‌ కల్చర్‌)మని మోదీ అన్నారు. ఎన్టీపీసీ తొలిదశ 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటును, సిద్దిపేట-సికింద్రాబాద్‌ రైల్వే లైన్‌ పనులకు 2016లో తానే శంకుస్థాపన చేశానని, ఇప్పుడు ప్రారంభోత్సవం చేసే అదృష్టం తనకే లభించిందని చెప్పారు. ఎన్టీపీసీ రెండో దశ ప్లాంటు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని పేర్కొంటూ, ఇవి పూర్తయితే, ప్లాంటు సామర్థ్యం 4 వేల మెగావాట్లకు చేరుకుంటుందని, దాంతో, తెలంగాణ ప్రజలకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీలు, ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం కృషి చేస్తోందని, బీబీనగర్‌ ఎయిమ్స్‌ను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారని చెప్పారు. గతంలో తాము ఇచ్చిన హామీని నెరవేర్చి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీజేపీని వారు ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-04T11:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising