V. Hanumantha Rao: ఉత్తమ్ నన్ను పార్టీ నుంచి పంపించడానికి కుట్ర చేస్తున్నారు
ABN, First Publish Date - 2023-10-22T16:59:29+05:30
కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు పంపేందుకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (V. Hanumantha Rao) అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు పంపేందుకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (V. Hanumantha Rao) అన్నారు. ఆదివారం నాడు గాంధీభవన్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ..‘‘అంబర్‌పేట్ నియోజకవర్గం నుంచి గతంలో గెలిచి మంత్రిని అయ్యాను. అంబర్‌పేట్ అభివృద్ధి కోసం చాలా పనులు చేశా. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను లక్ష్మణ్ యాదవ్ అడుగుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి యాదవ్ లు గెలిచారు. గత ఎన్నికల్లో కోదండరాం గట్టిగా పట్టు పట్టి.. అధిష్ఠానం కూడా చెప్పడంతో వెనక్కి తగ్గాను. ఇప్పుడు ఉత్తమ్ నా అంబర్ పేట్ సీట్ వెంట పడ్డాడు. ఇక్కడ నూతి శ్రీకాంత్‌గౌడ్‌ను.. ఉత్తమ్ ఎగదోస్తున్నారు. శ్రీకాంత్ అనే వ్యక్తి.. నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టాడు.శ్రీకాంత్ లాంటి వ్యక్తిని ఉత్తమ్ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. తనపై దుష్పచారం చేస్తున్నాడు’’ అని వీహెచ్ మండిపడ్డారు.
బీసీ మీటింగ్ కూడా పెట్టనీయలేదు
‘‘గత ఎన్నికల్లో డబ్బులు తీసుకొని వెనక్కి తగ్గారని చెప్పడం కరెక్ట్ కాదు. హనుమంతరావు డబ్బులు తీసుకునే వ్యక్తి నా.. డబ్బులకు అమ్ముడుపొతే సగం హైదరాబాద్ నాదే ఉండేది. సూర్యాపేటలో బీసీ మీటింగ్ పెడుతా అంటే.. పెట్టనీయలేదు. ఉత్తమ్‌కు బీసీ ఓట్లు కావాలి.. బీసీ మీటింగ్ వద్దా.. నేను పార్టీ మారను.. గాంధీ కుటుంబానికి వీరాభిమానిని. ఉత్తమ్ తన మనుషులు మహేశ్వర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డిని పంపించాడు. జగ్గారెడ్డిని కూడా పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేశాడు. జగ్గారెడ్డితో పీసీసీ అధ్యక్షుడవు అవుతావని రేవంత్‌రెడ్డితో ప్రతిరోజు మీడియాలో మాట్లాడించింది ఉత్తమ్‌రెడ్డినే. పార్టీ మారుతున్నానని మీడియా లో ప్రచారం చేసుకొని... బ్లాక్ మెయిల్ చేసి పదవులు తెచ్చుకున్నాడు. స్క్రీనింగ్ కమిటీ లో ఉండి మాపై దుష్పచారం చేస్తున్నాడు. ఉత్తమ్ పార్టీ వ్యతిరేకంగా చేసిన పనులను బయట పెడుతా.. నేను పార్టీ లాయలిస్ట్‌ను. నీకు, నీ భార్యకు సీట్లు కావాలి.. మా సీట్లు మాకు వద్దా.. అంబర్‌పేట సీటు నాది.. నాకు దక్కకుండా చేస్తే.. నేను కూడా ఉత్తమ్ వెంట పడుతా’’ అని వి.హనుమంతరావు తీవ్రంగా హెచ్చరించారు.
Updated Date - 2023-10-22T16:59:29+05:30 IST