YS Sharmila: ధరణి తప్పుల తడకని సీఎం కేసీఆర్ అఫిడవిట్‌తో తేలిపోయింది
ABN, First Publish Date - 2023-11-11T16:23:40+05:30
కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమైతుందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి విరచుకుపడ్డారు.
హైదరాబాద్: కేసీఆర్ (CM KCR) మానస పుత్రిక ధరణి (Dharani Portal) తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమైతుందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి (YSRTP Chief YS Sharmila) విరచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగన్నారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్ల దాకా మార్చి చూపించే మాయాజాలమే ధరణి అంటూ వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ధరణి గోసలే అని అన్నారు. తహశీల్దార్ దగ్గర నుంచి కోర్టుల దాకా ధరణి బాధలే అని చెప్పుకొచ్చారు. రైతుల భూములను గుంజుకొని, కోర్టుల చుట్టూ తిప్పుతూ, ధరణే దైర్యం అని చెప్పడానికి దొరకు ఆయన బందిపోట్లకు సిగ్గుండాలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ వివాదాల కోసం కాదు.. ముమ్మాటికి దొర భూ దోపిడీ కోసమే తెచ్చుకున్న పథకమని ఆరోపించారు. బందిపోట్ల ఆస్తుల్ని పెంచడానికి అమలు చేసిన పథకం అని అన్నారు. ధరణి తిప్పలు తప్పాల్నంటే దొర నియంత పాలనను బొంద పెట్టుడు ఒక్కటే మార్గమని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్ల కారుకు కర్రు కాల్చి వాత పెట్టుడు ఒక్కటే పరిష్కారం అని వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-11-11T16:24:37+05:30 IST