JNTU Hyderabad: విద్యార్థులకు బంపర్ న్యూస్.. 30 గ్రేస్ మార్కులు కలుపుతూ ఉత్తర్వులు జారీ
ABN , Publish Date - Dec 16 , 2023 | 06:47 PM
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయు) తాజాగా విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పింది. R18 బ్యాచ్ (మొదటి సంవత్సరం) స్టూడెంట్స్‌కి 30 మార్కుల సడలింపును ప్రకటించింది. 2022లో జరిగిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో...

JNTU Hyderabad: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయు) తాజాగా విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పింది. R18 బ్యాచ్ (మొదటి సంవత్సరం) స్టూడెంట్స్‌కి 30 మార్కుల సడలింపును ప్రకటించింది. 2022లో జరిగిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో తక్కువ మార్కులతో ఫెయిల్ అయిన బీటెక్, బీఫార్మసీ, బీబీఏ విద్యార్థులకు 30 గ్రేస్ మార్కుల్ని కలుపుతూ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. లేట్రల్ ఎంట్రీ విద్యార్థులకు కూడా 23 గ్రేస్ మార్కులు కలిపిన జేఎన్‌టీయూ.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని జీవోలో పేర్కొంది.
అంతకుముందు.. నవంబర్ 20వ తేదీన 500 మందికి పైగా మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు క్రెడిట్ ఆధారిత నిర్బంధ విధానాన్ని సడలించాలని కోరుతూ క్యాంపస్‌లో నిరసన చేపట్టారు. వీళ్లకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) విద్యార్థి విభాగం అయిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) తెలంగాణ నుండి మద్దతు కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే.. ఫెయిల్ అయిన విద్యార్థులకు 30 గ్రేస్ మార్కులు కలపాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ‘‘JNTUH వైస్ ఛాన్సలర్‌తో సమావేశం జరిగింది. సబ్జెక్ట్, క్రెడిట్ మినహాయింపు కోసం డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు 30 గ్రేస్ మార్కులు ఇస్తామని వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారు. JNTU తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని NSUI తెలంగాణ ప్రెసిడెంట్ వెంకట్ బల్మూర్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ఈ ప్రకటనపై JNTUH రిజిస్ట్రార్ డాక్టర్ ఎమ్. మంజూర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సడలింపు గత సంవత్సరం కూడా ఉంది. దాన్నే మేము ఈ సంవత్సరానికి పొడిగించాం’’ అని చెప్పారు. ఉద్యోగాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, డిగ్రీ పర్సంటేజీలకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సడలింపు ఇవ్వబడిందని స్పష్టం చేశారు. సబ్జెక్ట్ మినహాయింపు ఎందుకు ఇవ్వలేదో వివరిస్తూ.. ఒక సబ్జెక్ట్ మినహాయింపు ఇస్తే, మెమోలో ‘క్లియర్ చేయని సబ్జెక్ట్‌లు’ అని స్పష్టంగా పేర్కొనబడుతుందని అన్నారు. అప్పుడు డిగ్రీ సర్టిఫికేట్‌లకు విలువ ఉండదని.. ఇది విద్యార్థి డిగ్రీలో ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు.