Bandi Sanjay: ఎవరితో పొత్తు పెట్టుకోం.. ఒంటరిగానే వెళ్తాం
ABN, First Publish Date - 2023-06-22T11:59:45+05:30
తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని... ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం జిల్లాలోని 57వ డివిజన్‌లో బండి సంజయ్ పర్యటించారు. 9 ఏళ్ల మోదీ పాలనను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
కరీంనగర్: తెలంగాణలో బీజేపీ (BJP) ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని... ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) స్పష్టం చేశారు. ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం జిల్లాలోని 57వ డివిజన్‌లో బండి సంజయ్ పర్యటించారు. 9 ఏళ్ల మోదీ పాలనను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ‘‘నువ్వు కట్టిన ఇళ్ళు ముడితే కూలిపోతున్నాయి’’ అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అని అన్నారు. ‘‘నేను బీఆర్‌ఎస్ సపోర్ట్‌తో గెలిస్తే.. మరి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ఎలా గెలిచారు’’ అంటూ ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ కు అసలు డిపాజిట్ వచ్చిందా అని అడిగారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని బండి సంజయ్ పేర్కొన్నారు.
‘ఇంటింటికీ బీజేపీ’...
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకేరోజు 35 లక్షల కుటుంబాలను బీజేపీ నేతలు, కార్యకర్తలు కలవనున్నారు. అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు పోలింగ్ బూత్ అధ్యక్షుల వరకు ప్రతి ఒక్క కార్యకర్త ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో జనంలోకి వెళ్లనున్నారు. ఒక్కో కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ బూత్‌లో కనీసం వంద కుటుంబాల వద్దకు వెళ్లి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాల పంపిణీ చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ లోని 57వ డివిజన్, 173వ పోలింగ్ బూత్‌లోని ప్రజలను బండి సంజయ్ కలవనున్నారు. అంబర్‌పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో మోదీ తొమ్మిదేళ్ళ పాలనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కలవనున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం కొనసాగనుంది.
Updated Date - 2023-06-22T12:06:40+05:30 IST