KTDM: ఏం డౌట్ లేదు... ‘గూడెం’ బరిలో నిలిచేది కాంగ్రెస్సే...
ABN, First Publish Date - 2023-10-14T12:48:16+05:30
కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ అభ్యర్థికే కేటాయిస్తారని పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీ అభ్యర్థులకు కేటాయింపు జరుగుతున్నట్లు వస్తున్న ప్రచారం
కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ అభ్యర్థికే కేటాయిస్తారని పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీ అభ్యర్థులకు కేటాయింపు జరుగుతున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని టీపీసీసీ సభ్యుడు నాగ సీతారాములు, జిల్లా నాయకులు రాయల శాంతయ్య, వూకంటి గోపాలరావు స్పష్టం చేశారు. శుక్రవారం కొత్తగూడెం(Kothagudem)లో ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం కొత్తగూడెం అసెంబ్లీ టిక్కెట్ ఎవరికి కేటాయించినా ఆ అభ్యర్థికే సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో ఎటువంటి వర్గవిభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపే దిశగా పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలన విదానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించినట్లు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రస్తుతం అన్ని శాఖల అధికారులు అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏది చెప్తే అదే చేస్తారని అధికార పార్టీ ఓ ఎమ్మెల్సీ మాట్లాడిన వీడియో మీడియాలో చక్కర్లు కొడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తొత్తుగా మారిన అధికారులకు బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం ఇవ్వాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనచూపు మేర కనపడటం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, జిల్లా నాయకులు తూము చౌదరి, ఆళ్ల మురళీ, నాగేంద్ర త్రివేది, కొత్తగూడెం టౌన్ అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు సకినాల వెంకటేశ్వరరావు, అంతోటిపాల్, పల్లపు వెంకటేశ్వ ర్లు, జరీనా, రాజు, సుబ్బారెడ్డి, సత్యనారాయణ, రామలక్ష్మణ, పక్రొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-14T12:48:16+05:30 IST