Tenth paper leakage case: బండి సంజయ్ విడుదలైనట్లు లోక్‌సభ బులెటిన్
ABN, First Publish Date - 2023-04-06T18:10:41+05:30
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యవహారంపై లోక్‌సభ (Lok Sabha) బులెటిన్ విడుదల చేసింది. సంజయ్ అరెస్ట్, విడుదల అన్నీ
ఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యవహారంపై లోక్‌సభ (Lok Sabha) బులెటిన్ విడుదల చేసింది. సంజయ్ అరెస్ట్, విడుదల అన్నీ నిన్ననే (బుధవారం) జరిగిపోయినట్లు బులెటిన్‌లో వెల్లడించింది. పరీక్ష పేపర్ లీక్ (Tenth paper leakage) అంశాన్ని లోక్‌సభ సచివాలయం బులెటిన్‌లో ప్రస్తావించింది. శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారని ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసినట్లు బులెటిన్‌లో వెల్లడించారు. తెలంగాణ (Telangana) పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా బులిటెన్ విడుదల చేయడం గమనార్హం. లోక్‌సభకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ ఎంపీలు బుధవారం ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. నిన్నటి బులిటెన్‌ను లోక్‌సభ నేడు విడుదల చేసింది. లోక్‌సభ బులిటెన్‌లోని అంశాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీలు ప్రకటించారు.
జైలుకు సంజయ్
టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన బండి సంజయ్ జైలుకు వెళ్లారు. టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీతో సంబంధం ఉందంటూ మంగళవారం రాత్రి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. చివరికి లీకేజీకి ఆయనే ప్రధాన సూత్రధారి అని ప్రకటించారు. ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఆపై నాటకీయ పరిణామాల మధ్య కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. గురువారం విచారిస్తామని కోర్టు పేర్కొంది. దీంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ (Etala Rajender Raja Singh) సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ అరెస్టును బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah), నడ్డా, తరుణ్ ఛుగ్.. తెలంగాణ నేతలతో మాట్లాడారు.
బండి సంజయ్‌పై 8 సెక్షన్ల కింద కేసులు
టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్‌పై పోలీసులు 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 12బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 447 (నేరపూరితంగా చొరబడటం), 505 ఏబి (అనధికారికంగా, నేరపూరిత ఆలోచనలతో పబ్లిష్ చేయడం, ప్రచారం చేయడం), సెక్షన్ 4, 6, 8 (మాల్‌ప్రాక్టీస్), 66డి ఐటీ చట్టం (సైబర్ క్రైం) కింద కేసులు నమోదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Updated Date - 2023-04-06T18:18:53+05:30 IST