ponguleti: మాజీ ఎంపీ పొంగులేటి సంచలన కామెంట్స్.. ఎక్కడినుంచైన పోటీ చేస్తా..
ABN, First Publish Date - 2023-09-12T12:21:07+05:30
రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి అధికారం చేపడుతుందని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు
కొత్తగూడెం, (ఆంధ్రజ్యోతి): రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి అధికారం చేపడుతుందని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు జనరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం ఆదేశిస్తే ఎక్కడి నుంచైన పోటీ చేస్తానని ప్రకటించారు. సోమవారం విలేకర్లతో చిట్‌చాటుగా మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక స్థానాల్లో విజయం సాధించేందుకు దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం తాను పోటీచేసే నియోజకవర్గంతోపాటు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బీజేపీ శాసనసభ్యులు ఈటెల రాజేందర్(Revanth Reddy and BJP legislator Etela Rajender) పోటీ చేసే నియోజకవర్గాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురి చేస్తారని తెలిపారు. తాను బీఆర్ఎస్కు వ్యతిరేకంగా గొంతు విప్పినప్పుడే ఇబ్బందులకు గురి చేస్తారని ఊహించే అన్నింటికి సిద్దమయ్యామని తెలిపారు. తన కంపెనీలకు సంబంధించిన కాంట్రాక్టు పనుల బిల్లులను సైతం ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, అయినప్పటికీ ముందుకు సాగుతామని ప్రకటించారు. ఈ నెల 17వ తేదీన జరిగే కాంగ్రెస్ బహిరంగసభలో సోనియా గాంధీ హజరైన అనంతరం అనేక చేరికలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్‌కి పూర్వవైభవం వస్తుందని, ప్రజల దీవెనలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
కొత్తగూడెంలో కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం..
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బూడిదగడ్డ రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించి గడపగడపకి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో ఇంటింటికి కలియ తిరిగి పోస్టర్లను అందజేసీ మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధించాలంటే బీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని గొప్పలు చెప్పిన కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చాడని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తే డబుల్‌బెడ్ రూం, పెన్షన్లు, యువతకు ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారం వచ్చాక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని మండిపడ్డారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు తాండ్ర నాగబాబు ఆధ్వర్యంలో రెండో వార్డులో వంద కుటుంబాలు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వూకంటి గోపాలరావు, టీపీసీసీ సభ్యులు నాగసీతారాములు, ఆళ్ల మురళీ, తూము చౌదరి, నాగేంద్ర త్రివేది, లింగం పిచ్చిరెడ్డి, తాండ్ర నాగబాబు, గుడ్ల ఉమా, రావూరి వీరభద్రం, మారెడ్ల నర్సింహారెడ్డి, బాల ప్రసాద్, గుడివాడ రామలక్ష్మణ్, గౌస్, అయూబ్, సుందర్‌లాల్ కోరి, నిరంజన్‌రెడ్డి, మున్నా విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించాలి
కొత్తగూడెం పోస్టాపీస్ సెంటరు: 43 సంవత్సరాల నుంచి కొత్తగూడెం నుంచి నడిపిస్తున్న సింగరేణి రైలును మిగతా ప్యాసింజర్ రైళ్లను తిరిగి పూర్తిగా రద్దు చేయడాన్ని నిరసిస్తూ తిరిగి తక్షణమే పునరుద్దరించాలని పీసీసీ ప్రచారకమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. సోమవారం రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను నడిపించాలని రైల్వే ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాన్ని స్టేషన్‌మాస్టర్ ముండేకు అందజేశారు. సౌల్ సెంట్రల్ రైల్వే జీఎం, రైల్వేమంత్రి, కొత్తగూడెం రైల్వేస్టేషన్ (భద్రాచలం రోడ్) ఏరియా మేనేజరుకు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2023-09-12T12:25:49+05:30 IST