18న అమిత్ షాతో పొంగులేటి భేటీ..! ఖమ్మం నేతలతో కేసీఆర్ కీలక భేటీ
ABN, First Publish Date - 2023-01-09T17:58:20+05:30
రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ‘కారు’ దిగిపోనున్నారా? బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్నారా? సంక్రాంతి తర్వాత పార్టీ మారనున్నారా? కాషాయ కండువా కప్పుకోనున్నారా? అంటే తాజా రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. ఆయన పార్టీ మారే అంశంపై బీఆర్‌ఎస్, బీజేపీ (BRS BJP) వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. జనవరి 1న కార్యకర్తలు, అభిమానులతో భారీ బల ప్రదర్శన చేసిన పొంగులేటి.. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. ఖమ్మం బీఆర్‌ఎస్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముసలమొదలైంది. ఈనెల 18న కేంద్రమంత్రి అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నేతలతో కేసీఆర్ (KCR) సమావేశమయ్యారు. పొంగులేటి వెంట బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లకుండా.. కట్టడి చేసేందుకే కేసీఆర్.. ఈ సమావేశాన్ని నిర్వహించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పొంగులేటి, అమిత్‌షా ఈ నెల 18న భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అదే రోజు ఖమ్మం (Khammam)లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న సభ ఇదే కావడం గమనార్హం.
18న ఖమ్మంలో బీఆర్‌ఎస్ సభ
18న ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో.. అదే రోజు బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్ అధినాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే సభ ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay), ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao)తోపాటు వరంగల్, తదితర జిల్లాలకు చెందిన మంత్రులతో కేసీఆర్ సమావేశమై చర్చించారు. ఖమ్మం సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతోపాటు పలువురు మాజీ సీఎంలు, పలు రాష్ట్రాల్లోని బీఆర్‌ఎస్ అనుకూల పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మంలో నిర్వహించబోయే ఈ బహిరంగ సభ ద్వారా పార్టీ క్యాడర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Updated Date - 2023-01-09T17:58:21+05:30 IST