Share News

Revanth Reddy: నరేంద్ర మోదీ అనే మెడిసిన్‌కు ‘ఎక్స్‌పైరీ డేట్’ అయిపోయింది

ABN , Publish Date - Dec 28 , 2023 | 09:23 PM

ప్రతి మెడిసిన్‌కు ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని, ఇప్పుడు నరేంద్రమోదీ అనే మెడిసిన్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్ దేశంలో పని చేయదని..

Revanth Reddy: నరేంద్ర మోదీ అనే మెడిసిన్‌కు ‘ఎక్స్‌పైరీ డేట్’ అయిపోయింది

Revanth Reddy On PM Modi: ప్రతి మెడిసిన్‌కు ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని, ఇప్పుడు నరేంద్రమోదీ అనే మెడిసిన్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్ దేశంలో పని చేయదని పేర్కొన్నారు. ఈసారి ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగాల జెండా ఎగరడం ఖాయమని.. దీనిని మోదీ కూడా ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగపూర్‌లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదివరకే చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని, 150 రోజుల వరకు సాగిన ఈ యాత్రలో ఆయన 4 వేలకు పైగా కిలోమీటర్లు నడిచారని అన్నారు. భారత్ జోడో యాత్ర స్ఫూర్తితోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కర్ణాటక తర్వాత జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించిందని, తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఈ జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించిందని, కాబట్టి, ఈసారి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని నమ్మకం వ్యక్తం చేశారు.

ఇప్పుడు రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ను మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టనున్నారని.. ఈ దెబ్బకు కేంద్రంలో కాంగ్రెస్ రావడం పక్కా అని రేవంత్ రెడ్డి చెప్పారు. బీజేపీ చెప్పే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే.. ఆదానీ, ప్రధాని అని ఆయన అభివర్ణించారు. లోక్‌సభలో రాహుల్ గొంతు విప్పడంతో ఆదానీ ఇంజన్ ఆగిపోయి షెడ్‌కు వెళ్లిందని తూర్పారపట్టారు. ఇప్పుడు భారత్ న్యాయ యాత్రతో ప్రధాని ఇంజన్ ఆగిపోవడం ఖాయమని, దాన్ని షెడ్డుకు పంపడం తథ్యమని అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి దేశాన్ని కాపాడుకుందామని.. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులంతా పని చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - Dec 28 , 2023 | 09:23 PM