Bandi Sanjay: తెలంగాణలో రాక్షస రాజ్యాన్ని అంతమొందిస్తాం
ABN, First Publish Date - 2023-04-23T22:29:20+05:30
విజయ సంకల్ప సభలో బండి సంజయ్ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు.
చేవెళ్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తీరుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Telangana BJP Chief Bandi Sanjay) మండిపడ్డారు. కేసీఆర్ తనను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో(Chevella) ఆదివారం జరిగిన విజయ సంకల్ప సభలో బండి సంజయ్ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. హిందీ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో తనను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారని, 8 గంటలు రోడ్డుమీదే తిప్పారని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం ఇక్కడికి వస్తుంటే కేసీఆర్ అడుగడుగునా అడ్డుకుంటుందన్నారు. ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తామని, ఫసల్‌బీమా అమలు చేస్తామని, ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ఖాళీ పోస్టులను భర్తీం చేస్తామన్నారు. తెలంగాణలో రాక్షస రాజ్యాన్ని, కుటుంబ పాలనను, నియంత పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకు అమిత్‌షా ఆధ్వర్యంలో చేవెళ్లకు వచ్చామని సంజయ్ చెప్పారు. లాఠీ దెబ్బలకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah), కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇంఛార్జీలు తరుణ్‌చుగ్, మురళీధర్‌రావు, సహ ఇంచార్జీ అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో ఆసుపత్రి అధినేత సంగీతారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు చేవెళ్ల సభకు హాజరయ్యారు.
Updated Date - 2023-04-23T22:30:25+05:30 IST