Tummala Nageswara Rao: కాంగ్రెస్‌లో.. ‘తుమ్మల’ చేరికకు తేదీ ఫిక్స్...?
ABN, First Publish Date - 2023-09-01T13:17:17+05:30
బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో అధినాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఈనెల 6న చేరబోతున్నారని ప్రచారం
- తుమ్మల నివాసానికి వెళ్లిన రేవంత్, సుదర్శన్‌రెడ్డి
- పార్టీలోకి రావాలని ఆహ్వానం
ఖమ్మం, (ఆంధ్రజ్యోతిప్రతినిధి): బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో అధినాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయి. ఆయన హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైందని, ఈనెల 6న ఢిల్లీ వేదికగా ఆయన చేరిక ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి గురువారం సాయంత్రం జరిగిన పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. గండుగులపల్లి నుంచి హైదరాబాద్ నివాసానికి వెళ్లిన తుమ్మలను.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(PCC President Revanth Reddy)తోపాటు మరికొందరు నేతలు నేరుగా కలిసి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
వారం రోజులుగా క్యూ కడుతున్న అభిమానులు బీఆర్‌ఎస్ టికెట్ దక్కని నేపథ్యంలో అసంతృప్తికి గురైన తుమ్మల ఇటీవల హైదరాబాద్(Hyderabad) నుంచి ఖమ్మం వచ్చిన క్రమంలో ఆయన అనుచరవర్గం మహార్యాలీతో సత్తాచాటింది. అలాగే ఆ ర్యాలీలో బీఆర్‌ఎస్ జెండాలు, కేసీఆర్, కేటీఆర్(KCR, KTR) ఫొటోలు లేకుండా తుమ్మల ఫొటో ముద్రించి ఉన్న తెల్లజెండాలను రెపరెపలాడించారు. దీంతో తుమ్మల బీఆర్‌ఎ్‌సను వీడటం దాదాపు ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో వారంరోజులుగా గండుగులపల్లిలో ఉన్న తుమ్మలను కలిసేందుకు ఉమ్మడి జిల్లా నుంచి ఆయన వర్గం నాయకులు, అనుచరులు, అభిమానులు క్యూ కట్టారు. భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందేనని, కాంగ్రెస్ లో చేరాలని, లేదంటే స్వతంత్రంగానైనా పాలేరు నుంచి పోటీ చేయాల్సిందేనని తుమ్మల ఎదుటే స్పష్టం చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎ్‌సలో అవమానం జరిగిందని, ఎన్నికల తర్వాత మళ్లీ వాడుకుని వదిలేస్తారని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. దాంతో ‘మీ మాటే నామాట’ అని చెప్పిన తుమ్మల తాను పాలేరులో పోటీచేస్తానని, గోదావరి జలాలతో ప్రజల పాదాలు కడుగుతానని, క్షేత్రస్థాయిలో ప్రతీ ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. కానీ ఈ విషయంపై తుమ్మల ఎక్కడా బహిరంగంగా స్పష్టతనివ్వలేదు. బీఆర్‌ఎ్‌సనుంచి ఎంపీ నామ నాగేశ్వరరావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాదులో ఆయన్ను కలిసి చర్చించినా ఆయన మెత్తబడలేదు. తనకు పాలేరు టికెట్ ముఖ్యమని, వేరే పదవులు అవసరంలేదని, పాలేరు ప్రజలకు తానిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే పాలేరు ఎమ్మెల్యేగా పోటీచేయాలనేది తన లక్ష్యమని పలుసార్లు స్పష్టంచేశారు.
కాంగ్రెస్ నుంచి అందిన ఆహ్వానం
గండుగులపల్లిలో ఉమ్మడిజిల్లాకు చెందిన అనుచరులతో పలుమార్లు చర్చించిన అనంతరం గురువారం మధ్యాహ్నం తుమ్మల హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు ఆయన నివాసానికి వెళ్లి.. కాంగ్రె్‌సలోకి రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో తుమ్మల రేవంత్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మల్లు రవిని సత్కరించారు. అనంతరం వారితో చర్చించిన తుమ్మల తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఈభేటీతో తుమ్మల కాంగ్రె్‌సలో చేరిక దాదాపు ఖాయమని తెలుస్తుండగా.. ఈ పరిణామం రాష్ట్రరాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అటు టీడీపీ, ఇటు బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న తుమ్మలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయనకున్న పరిచయాలతో టీడీపీ మాజీనేతలను, ఇతర పార్టీల్లోని సీనియర్లు, పలురంగాల ప్రముఖులను కాంగ్రెస్ వైపు తిప్పుతారని, ఇదంతా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశమన్న చర్చ జరుగుతోంది.
తుమ్మల వెంటే తామంటున్న అనుచరులు
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీచేయాలని నేలకొండపల్లి(Nelakondapally) మండలానికి చెందిన పలువురు నేతలు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విజ్ఞప్తిచేశారు. గురువారం ఉదయం గండుగులపల్లిలో తుమ్మలను కలిసి వారు ఆయనతో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రిగా పాలేరు నియోజకవర్గం, జిల్లాలోచేసిన అభివృద్ధిని గుర్తుచేసుకున్నారు. ‘మీ గెలుపుతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, ఏపార్టీనుంచి పోటీచేసినా మీ గెలుపునకు కృషి చేస్తాం’ అని తుమ్మలకు ఆ నేతలు స్పష్టం చేశారు. అలాగే తల్లాడ మండలంలోని తుమ్మల మద్దతుదారులు గురువారం బిల్లుపాడు గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ తుమ్మల ప్రధాన అనుచరుడు జక్కంపూడి కృష్ణమూర్తి మాట్లాడుతూ తుమ్మలను కాదనుకున్న సీఎం కేసీఆర్ ఫలితం అనుభవిస్తారన్నారు. ఉమ్మడి జిల్లాలో తుమ్మల చేసిన అభివృద్ధి ఏంటో అందరికీతెలుసన్నారు. ఆయన వెంటే తాము నడుస్తామని స్పష్టం చేశారు.
తుమ్మలన్న రా.. కదలిరా అంటూ ప్లెక్సీ
తుమ్మల బీఆర్‌ఎ్‌సను వీడటం దాదాపు ఖాయమైందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తుమ్మలకు మద్దతుగా పలుచోట్ల అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో తల్లాడ రింగ్‌రోడ్డు సెంటర్లో ‘తుమ్మలన్న రా! కదలిరా! జనమంతా ప్రభంజనంలా మీ వెంటే’ నంటూ ఆయన అభిమానులు ఏర్పాటు చేసి భారీ ప్లెక్సీ చర్చకు తెరలేపింది.
Updated Date - 2023-09-01T13:17:19+05:30 IST