KTR: బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేటీఆర్ తొలి పర్యటన.. ఎక్కడంటే?
ABN, First Publish Date - 2023-12-05T13:19:08+05:30
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 119 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఓటమి తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ తొలి పర్యటన చేశారు.
జనగామ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 119 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఓటమి తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) తొలి పర్యటన చేశారు. మంగళవారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా నిన్న (సోమవారం) మృతి చెందిన జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మృతదేహానికి బీఆర్‌ఎస్ నేత నివాళులు అర్పించారు. కేటీఆర్ వెంట వచ్చిన బీఆర్ఎస్ నూతన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా సంపత్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. సంపత్ రెడ్డి నిన్న గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.
నివాళులనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. సంపత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో సంపత్ రెడ్డి ఒకరన్నారు. జనగామ జిల్లాలో సంపత్ రెడ్డిలేని లోటు తీర్చలేనిదన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో నివాళులు అర్పిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
Updated Date - 2023-12-05T13:19:09+05:30 IST