సీతక్క ఎదుట సవాళ్లు!
ABN , First Publish Date - 2023-12-12T23:09:39+05:30 IST
ధనసరి సీతక్క.. మొన్నటి వరకు ఆమె ములుగు ఎమ్మెల్యే. నియోజకవర్గ సమస్య లపై ఆమె పలుమార్లు అసెంబ్లీలో గళం విప్పారు. సమస్యలు ఏవైనా అధికార పార్టీని నిలదీసేవారు. కొన్ని సందర్భాల్లో పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. అసెం బ్లీ సాక్షిగా అవహేళనను సైతం ఎదుర్కొన్నారు. చీటికి మాటికీ గొంతు ఎత్తుతారనే మాటలు పడ్డారు.

సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని ప్రజా సమస్యలు
అసెంబ్లీలో పలుమార్లు నిలదీసిన సీతక్క
ఎమ్మెల్యేగా గత ప్రభుత్వంపై పోరు
కాంగ్రెస్ సర్కారులో ఇప్పుడు కీలక పదవి
మంత్రిగా ‘ములుగు’ను అభివృద్ధి చేసుకొనే అవకాశం
తమ కలలు నెరవేరుతాయని ప్రజల ఆశలు
ములుగు, డిసెంబరు 12: ధనసరి సీతక్క.. మొన్నటి వరకు ఆమె ములుగు ఎమ్మెల్యే. నియోజకవర్గ సమస్య లపై ఆమె పలుమార్లు అసెంబ్లీలో గళం విప్పారు. సమస్యలు ఏవైనా అధికార పార్టీని నిలదీసేవారు. కొన్ని సందర్భాల్లో పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. అసెం బ్లీ సాక్షిగా అవహేళనను సైతం ఎదుర్కొన్నారు. చీటికి మాటికీ గొంతు ఎత్తుతారనే మాటలు పడ్డారు. అవ న్నింటినీ బేఖాతరు చేశారు సీతక్క. తన ప్రజలే తనకు ముఖ్యమన్నారు. వారి కోసం ఎంతటి పోరాట మైనా చేస్తానని అనేవారు. అయితే... ఇవన్నీ ఒకప్పటి ముచ్చ ట. ఇప్పుడామె మంత్రి అయ్యారు. అధికారం ఆమె చేతికి చిక్కింది. ఇక ఎవరి చుట్టూ తిరగాల్సిన అవస రం లేదు. తన నియోజకవర్గ సమస్యలను తానే పరిష్కరించుకొనే అవకాశం సీతక్కకు దక్కింది. పైగా రాష్ట్రవ్యాప్తంగా కూడా అలాంటి పవరే ఆమెకు వచ్చింది. దీంతో ప్రజల్లో కొంగొత్త ఆశలు చిగురిస్తు న్నాయి. ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి ఇక పరుగులు పెడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. అలాంటి పరిస్థితులు ఉంటాయా.. తన ముందున్న సవాళ్లను సీతక్క ఎదుర్కొంటారా.. సర్కారును ఒప్పించి సరిపడా నిఽధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి ఆమె కృషి చేస్తారా..? అనే చర్చ కూడా కొనసాగుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పోరాడిన సీతక్క.. అదే పటిమతో స్వపక్షాన్ని ఒప్పించి నియోజక వర్గంలోని పెండింగ్ పనులు చేయిం చుకుంటారా..? అనేది ఆసక్తిగా మారింది.
ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో సీతక్కకు అధికారం ఏనాడూ దక్కలేదు. 2004 నుంచి 2023 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఐదోసారి అదృష్టం వరించింది. ఈ మధ్యకాలంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లిన ఆమె ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం వందల కొద్దీ వినతి పత్రాలను ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా శాఖలను పర్యవేక్షిస్తున్న ఐఏఎస్ అధికారులకు ఇచ్చారు. ఏ శాసనసభ సమావేశానికీ గైర్హాజరు కాని సీతక్క ప్రతిసారీ స్థానిక సమస్యలను ఏకరువు పెట్టారు... సందర్భాన్నిబట్టి నిలదీశారు కూడా. ఇలా రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఆమెకు నియోజకవర్గంపై పూర్తి పట్టు లభించింది. ఏ మండలంలో.. ఏగ్రామంలో ఏవిధమైన ఇబ్బందులున్నాయో చెప్పేంత అవగాహన కలిగింది.
నీటి వెతలు తీరుస్తారా..?
పూర్తి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ములు. తలాపు నుంచి గోదావరి వంద కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నా సాగునీటి కోసం వెతలు తప్పడం లేదు. దేవాదుల ఎత్తిపోతల పథకం, తుపాకులగూ డెం సమ్మక్క బ్యారేజీలున్నా పరీవాహక మండలాల పొలాలు కూడా ఎండుతున్నాయి. నదీ జలాలను ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోస్తున్నా పాలకులు ములు గు రైతాంగాన్ని విస్మరించడాన్ని సీతక్క తీవ్రంగా ఆక్షేపించారు. పైప్‌లైన్, గ్రావిటీ కాల్వలను విస్తరించి అన్ని మధ్య, చిన్నతరహా చెరువుల్లోకి గోదావరి నీటిని లిఫ్టు చేయాలని సంకల్పించారు. అటవీ మండలాల్లో చెక్‌డ్యామ్‌లను నిర్మించడం ద్వారా వర్షం నీటిని ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడంతోపాటు భూగర్భ జలాల పెంచాలనుకున్నారు. ఇదే అంశంపై అనేక పర్యాయాలు మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చిన సీతక్క మంత్రి హోదాలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. లక్నవరం కెనాల్ నిర్మాణ ఫైల్‌ను దులిపి పనులను పట్టాలెక్కించాలని కోరుతున్నారు.
బస్ డిపోను మరవొద్దు..
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రధానమైనది. అయితే.. సరైన బస్సు సౌకర్యం లేక దశాబ్దాల కాలంగా ములుగు ప్రజలు తిప్పలు పడుతున్నారు. బస్సు సర్వీసుల పెంపు కోసం ఎమ్మెల్యే హోదాలో సీతక్క వరంగల్-2 డిపో ఎదుట ధర్నా చేసిన సందర్భాలున్నాయి. జిల్లా కేంద్రం లేదా ఏటూరునాగారంలో డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఏటూరునాగారంలో ఇప్పటికే కేటా యించిన స్థలం ఉండగా ములుగులో అనువైన ప్రదేశా లు అనేకం ఉన్నాయి. ఈ విషయంలో మంత్రి సీతక్క నిర్ణయం తీసుకోవడమే తరువాయి. ఈ విషయాన్ని మంత్రి మరవొద్దని ప్రజలు కోరుతున్నారు.
పోడు భూములు..
నియోజకవర్గంలో అతిపెద్ద సమస్యల్లో పోడు భూ ముల అంశం ఒకటి. గత ప్రభుత్వం 7,413 మందికి 18,869 ఎకరాలకు హక్కులు కల్పించింది. కానీ, దరఖా స్తులు మాత్రం 77వేల ఎకరాలకు వచ్చాయి. నిబంధన ల పేరుతో చాలామంది అర్హులను విస్మరించారని, గిరిజనేతరులకూ హక్కులు కల్పించాలని సీతక్క చెబు తూ వచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె పోడు భూములు-హక్కులపై ప్రత్యేకంగా దృష్టిసారిం చాలని ప్రజలు కోరుతున్నారు. రాహుల్‌గాంధీ సభ, రేవంత్‌రెడ్డి హాత్‌సే హాత్ జోడో యాత్రల సమయంలో ఇదే అంశం ప్రస్తావనకు రాగా వారు సైతం గిరిజనులు, గిరిజనేతరులకూ పట్టాలిస్తామని హామీలిచ్చారు. ఈ హామీని సీతక్క నెరవేరుస్తారని పోడుదారులు ఎదురుచూస్తున్నారు.
- మేడారం ప్రగతి
వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు మేడారం మహా జాతర జరగనుంది. ఇప్పటికే రూ.75కోట్లతో జిల్లా అధికార యంత్రాంగం నివేదిక పంపించింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నిధుల కేటాయింపు, టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికలు ముగిసిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో నిధులను పెంచి విడుదల చేయడంతోపాటు త్వరితగతిన పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మేడారం జాతరకు జాతీయ పండగ హోదా కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలని వనదేవతల భక్తులు కోరుతున్నారు.
- మనిసిపాలిటీ అభివృద్ధి, కొత్త మండలాల ఏర్పాటు..
కొత్త మండలాల ఏర్పాటు కోసం సీతక్క గత పాలకులతో కొట్లాడారు. ఇటీవల మల్లంపల్లి మండలం, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఆమె డిమాండ్లలో మిగిలింది రాజుపేట, లక్ష్మీదేవిపేట మండలాలు. ములుగు మేజర్ గ్రామపంచాయతీ మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గం ఉండగా అన్ని పురపాలికలతో పాటు త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా, నియోజకవర్గ కేంద్రం కూడా కావడంతో ఇక్కడ మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. డ్రెయినేజీ ఆధునికీకరణ, పట్టణ సుందరీకరణకు సత్వర చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- గోదావరి, జంపన్నవాగులపై కరకట్టలు
ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి పరీవాహక గ్రామాల పరిరక్షణ కోసం గత ప్రభుత్వం రూ.120 కోట్ల నిధులు కేటాయించింది. పనులు మాత్రం ముందుకు కదలడంలేదు. యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టాల్సి ఉంది. కొండాయి వంటి జంపన్నవాగు, దయ్యాలవాగు పరీవాహక గ్రామాలను ముంపు నుంచి గట్టెక్కించేందుకు స్పెషల్ ప్యాకేజీ తేవాల్సి ఉంది. పరిరక్షణ, పునరావాసానికి ప్రాధాన్యతనివ్వాల్సి ఉంది. రామప్ప రిజర్వాయర్ ముంపు బాధితులకు నష్టపరిహారం దక్కాల్సి ఉంది. ఇవన్నిటిపై సీతక్క దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
- ఐటీడీఏ, ఆస్పత్రులు
ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధి కోసం ఏటూరునాగారంలో ఉన్న ఐటీడీఏను బలోపేతం చేయాలనే డిమాండ్ ఉంది. చాలావరకు శాఖలు నామమాత్రంగా మారగా వాటికి పునరుజ్జీవం పోయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి, సహకార రంగాలపై దృష్టిసారించాలని ఏజెన్సీ ప్రలు కోరుతున్నారు. ఇప్పటికీ అడవి పల్లెల్లో పురుటినొప్పుల బాధ ప్రాణాలను తీస్తోంది. కావళ్లు, డోలీలపై మోసుకొని వస్తూ గర్భిణులను వాగులు, వంకలు దాటవేసే పరిస్థితులు నెలకొన్నాయి. మెరుగైన వైద్యాన్ని మారుమూల పల్లెకూ చేర్చి, ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.