Heavy Rains: అమాంతం పెరిగిపోయిన ప్రాణాహిత, గోదవరి నదుల ప్రవాహం
ABN, First Publish Date - 2023-07-26T09:41:03+05:30
భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటు అధికంగా ఉంది. గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద 10.950 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి: భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటు అధికంగా ఉంది. గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద 10.950 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 75 గేట్లను ఎత్తివేసి 5,33,970 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 5,33,970 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అన్నారం సరస్వతి బ్యారేజ్ ఇన్ ప్లో 1,26,884 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. దీంతో అధికారులు బ్యారేజ్ 40 గేట్లు ఎత్తివేసి 1,22,634 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజ్ పూర్తి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 6.569 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
నిన్న ( మంగళవారం) మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీకి 5.79 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 85 గేట్లలో 75 గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లే వదులుతున్నారు. ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీలోకి 56,222 క్యూసెక్కుల వరద చేరుతుండగా 40 గేట్లను ఎత్తి 93,361 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద మంగళవారం 11.02 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహించింది.
దంచికొడుతున్న వానలు
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో దాదాపు 34 కాలనీలు నగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే గడిచిన 24 గంటల్లో జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరాసరి 82.7 మి.మి
మహబూబాబాద్ జిల్లాలో సగటున 93.4 మి.మి
వరంగల్ జిల్లాలో సగటున 141 మి.మి
హనుమకొండ జిల్లాలో సగటున 103.6 మి.మి
జనగామ జిల్లాలో సగటున 89.1 మి.మి
ములుగు జిల్లాలో 38.4 మి.మి సగటు వర్షపాతం నమోదు.
అత్యధికంగా హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరులో 170.4 మి.మి వర్షపాతం నమోదు.
Updated Date - 2023-07-26T09:41:03+05:30 IST