అభివృద్ధి నిధుల కోసం కోర్టుకెక్కిన సీతక్క

ABN , First Publish Date - 2023-09-30T00:21:29+05:30 IST

నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీఎఫ్‌) కోసం ములుగు ఎమ్మెల్యే సీతక్క హైకోర్టును ఆశ్రయించారు. మిగతా నియోజకవర్గాలతో సమానంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగుకు అభివృద్ధి నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అభివృద్ధి నిధుల కోసం కోర్టుకెక్కిన సీతక్క
ఎమ్మెల్యే సీతక్క

హైకోర్టులో కేసు నమోదు

సీడీఎఫ్‌పై జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధికారమేందని ఆక్షేపణ

ములుగు, సెప్టెంబరు 29: నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీఎఫ్‌) కోసం ములుగు ఎమ్మెల్యే సీతక్క హైకోర్టును ఆశ్రయించారు. మిగతా నియోజకవర్గాలతో సమానంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగుకు అభివృద్ధి నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును శుక్రవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వం తరుపు న్యాయవాదికి సూచిస్తూ అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీతో పాటు అవకాశమున్న ప్రతీ వేదిపై వాదించే సీతక్క నిధుల కోసం చివరకు కోర్టుకెక్కడం చర్చనీయాంశమైంది. కాగా, ఈ విషయమై సీతక్క స్పందించారు. గడిచిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడిగినా పట్టించుకోలేదని తెలిపారు. రూ.8కోట్ల 50లక్షల సీడీఎఫ్‌ నిఽధులు విడుదలయ్యాయని, వాటిని తనకు కేటాయించకుండా జాప్యం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొందరు బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీడీఎఫ్‌ ఇచ్చిన ప్రభుత్వం తనను కావాలనే విస్మరించిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కేటాయింపులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రమేయం ఎందుకని ప్రశ్నించారు. విపక్ష ఎమ్మెల్యేను రాజకీయంగా దెబ్బతీసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆరోపించారు. వెనుకబాటుకు గురైన ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకెళ్లాల్సి వచ్చిందని సీతక్క వెల్లడించారు.

Updated Date - 2023-09-30T00:21:29+05:30 IST